Saturday, December 15, 2007

తులిప్ పుష్పోత్సవం

కెనడా దేశ రాజధాని అట్టావాలో జరిగే తులిప్ పుష్పోత్సవం చూడటానికి చాలా బాగుంటుంది. ఇక నేను చెప్పేదెందుకు మీరే చూసి చెప్పండి.


















































































ఇలాంటి పూబాటలు ఇక్కడ కోకొల్లలు.















పూవుల అందాలను కెమరాలతోకాక కుంచెతో బంధిస్తున్న కళాకారులు.































































కన్నుల పండుగే కాదు, వీనులవిందు కూడా








































పార్లమెంట్ భవనం









పార్లమెంట్ భవనం దగ్గర ఉన్న నీరు-నిప్పు కలగలసిన ఫౌంటెన్ (తెలుగులో ఏమంటారో తెలిసినవారు చెప్పగలరు. వారికి నా ముందస్తు కృతఙ్ఞతలు)












ఇది కెనడా దేశపు మింట్. ఇక్కడ నాణేలను తయారుచేస్తారు. భారతదేశపు నాణేలు కూడా కొన్ని ఇక్కడ రూపొందించబడ్డాయి.












అట్టావా మ్యుజియం హాలు. ఇక్కడ మనిషి వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని దశలవారీగా ప్రదర్శనకు ఉంచారు.

Saturday, December 1, 2007

నయగారాల నయాగరా

కెనడా, అమెరికా దేశాల సరిహద్దుల్లో ఉన్న సుందర జలపాతమే నయాగరా. దీని గురించి నేను చెప్పేకంటే నా ఫొటోలే బాగా చెపుతాయనుకుంటున్నాను. చూసి మీరే చెప్పాలి.





















































Monday, November 26, 2007

చలికాలం వణికిస్తోంది.

మాంట్రియాల్ చలికాలం ప్రవేశించింది. సాయంత్రం 4 గంటలకే చీకటి పడుతోంది. మంచు కురవటం ప్రారంభమైంది. నదులు, సరస్సులు గడ్డ కడుతున్నాయి. ఉష్ణోగ్రత మైనస్ 12 డిగ్రీలను తాకుతోంది. మంచు కురిసిన తర్వాత తీసిన ఫోటోలు. ఎలా ఉన్నాయి?


























Saturday, November 24, 2007

సెల్ ఫోన్ సరిగ్గా వాడుతున్నామా?

మనలో చాలామందికి సెల్ ఫోన్లు ఉన్నాయికాని వాటిని ఉపయోగించే విధానం మాత్రం కొద్దిమందికే తెలుసనిపిస్తుంది. నన్ను చిరాకు పెట్టిన సంగతేమిటంటే, వాటిని ఆఫీసులో ఉపయోగించే విధం. గంటల కొద్ది సమయం ఒక చేయి చెవికే అంటించేసి ఉంటుంది. ఆఫీసులో ఉన్నప్పుడు అంతసేపు పర్సనల్ విషయాలను ముచ్చటించుకోవటం అవసరమా అన్నది మనం నిర్ణయించుకోవాలి. ఇలా చేయటం వల్ల పని గంటలు వృధా కాదా?

మనలో చాలా మందికి ఉన్న అపోహ, ఫోన్ వస్తే దాంట్లో మాట్లాడటం తప్పదని. నిజంగానే అత్యవసర పరిస్థితుల్లో సెల్ ఫోన్ ఒక వరం. కాని వచ్చిన ప్రతి ఫోన్ కాలును పని మానుకుని మరీ తీసుకోవటం అవసరం లేదనుకుంటాను. నంబరు నోట్ చేసుకుని పనైంతర్వాత తీరిగ్గా ముచ్చటించుకోవచ్చు కదా?

ముఖ్యంగా మనం మన పని మానుకుని వేరేతని డెస్కు దగ్గర వెళ్ళి పని గురించి మాట్లాడేటప్పుడు అతనికి మధ్యలో ఫోన్ వస్తుంది. అది అతని స్నేహితుడు శుక్రవారం ఏ సినిమాకు వెళదామని అడగడానికో, మందు పార్టీ గురించో అయ్యుంటుంది. ఇతనేమో ’పనిలో ఉన్నాను, మళ్ళీ మాట్లాడత'నని అనకుండా అప్పుడే హస్కు వేసుకుంటాడు. అతని అత్యవసర సమావేశం అయ్యేదాక వేచి చూడాలి. అరికాలి మంట నెత్తికెక్కేదెప్పుడంటే, అతను ఫోన్ తాపీగా పెట్టేసి ’ఆ ఎక్కడున్నాం’ అనో ’సరే... ఇప్పుడేం చేద్దాం’ అని అన్నప్పుడు. అంతవరకు చెప్పిన దాన్నే మళ్ళీ రికార్డు వేయాలంటే ఎంత చిరాగ్గా ఉంటుందో చెప్పలేను. ఇలా చేయటం వల్ల ముగ్గురి సమయం వృధా అయ్యిందన్న ఇంగితం కూడా ఉండదు. బహుశా నేనూ కూడా పట్టించుకునేవాడిని కానేమో. కాని ఇక్కడ ఆఫీసు పధ్ధతులు చూసాక నాకు ఈ టపా వ్రాయాలనిపించింది. ఇక్కడ ఒక మనిషి మనవద్ద వచ్చి మాట్లాడుతున్నప్పుడు తమ సమయాన్నంతా అతనికే కేటాయిస్తారు. అతను చెప్పేదాన్ని శ్రద్ధగా వింటారు. మధ్యలో ఫోన్ వస్తే (సెల్ ఒకటే కాదు, ఆఫీసు ఫోన్ అయినా సరే) అది పర్సనల్ అయితేనో, ముఖ్యమైనది కాకపోతే, చేసిన వారి నంబరు నోట్ చేసుకుని కట్ చేసేస్తారు. ముఖ్యమైన కాల్ అయితే వీలైనంత త్వరగా ముగించి, క్షమాపణలు అడిగి సంభాషణ కొనసాగిస్తారు. మనం కూడా ఇలాంటి విషయాలను శ్రద్ధ తీసుకుని పాటిస్తే బాగుంటుంది. ఏమంటారు?

Monday, November 19, 2007

మాంట్రియాల్ కబుర్లు 1

సెయింట్ లారెన్స్ నది మధ్యలో ఉన్న సుందర ద్వీపనగరమే మాంట్రియాల్. యూరప్ బయట ఫ్రెంచ్ సంస్కృతికి ప్రధాన నగరంగా భాసిల్లుతోంది. చుట్టూ విశాలమైన నది ప్రవాహం కన్నుల పండుగ చేస్తూ జెట్ బోటింగ్ లాంటి క్రీడలకు ఆహ్వానిస్తుంటే, చిన్న చిన్న ద్వీపాలలో ఉండే అమ్యూజ్మెంట్ పార్కులు ఆటలాడుకోవటానికి ఉత్సాహపరుస్తాయి. ఇక సేదతీరటానికి ఉద్యానవనాలు సరేసరి. మాంట్రియాల్ కెనడా దేశపు క్వీబెక్ (Quebec) ప్రావిన్స్ కు చెందుతుంది మరియు కెనడా నాలగవ పెద్ద నగరంగా గుర్తించబడుతోంది.

వేసవి ఆటవిడుపుగా మాంట్రియాల్ నగరానికి గొప్ప పేరుంది. సూర్యకాంతి ఎక్కువసేపుండటం బాగా కలసి వచ్చే విషయం. వేసవిలో సూర్యుడు ఉదయం 5 కన్నా ముందే ఉదయించి రాత్రి 9.30 దాటాకగాని అస్తమించకపోవటంతో వేసవిలో ప్రతిరోజూ తిరునాల జరుగుతున్నట్లుంటుంది. వివిధ రకాల పండుగలతో, పెరేడ్లతో నగర ప్రధాన వీధి సెయింట్ కాథరిన్ మహా సందడిగా ఉంటుంది. ఒలంపిక్ స్టేడియం, బయోడోమ్, మౌంట్ రాయల్ లాంటి ముఖ్యప్రదేశాలే కాక మరెన్నో చూడదగ్గ ప్రదేశాలతో పర్యాటకులను అలరిస్తుంది.

ముఖ్యంగా బయోడోమ్ పిల్లలకు నచ్చుతుంది. ప్రపంచంలోని వివిధ రకాల అటవీ వాతావరణాలను ఇక్కడ కృతిమంగా సృష్టించారు. సముద్రపు వాతావణాన్ని, tropical, polar వాతావరణాలను, అక్కడ నివసించే చెట్లను, పక్షులను, జంతువులను ఇక్కడ ఉంచారు. నాకు బాగా నచ్చిన వాటిలో ఇది ముఖ్యమైనది.

మాంట్రియాల్ మరో ప్రధాన ఆకర్షణ Old Port . ఇది పురాతన ఫ్రెంచ్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. పడవపై విహార యాత్రలకు చాలా బాగుంటుంది. పురాతన కట్టడాలు ఈ ప్రాంతపు ప్రత్యేకత. ఇక చెప్పడమెందుకు చూసి ఆనందించండి. మరోసారి మరిన్ని విశేషాలతో..
ఇదే బయో డోమ్. చూడటానికి చిన్నదిగా కనిపించినా, సమస్త ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. వృక్ష, ప్రాణి, పక్షి ప్రపంచాలతో పాటు జల ప్రపంచం కూడా ఇక్కడ చూడ వచ్చు.











































నాకు నచ్చిన ఫోటోల్లో ఇదొకటి. బాగుందా?







ఒలంపిక్ స్టేడియంనుండి మాంట్రియాల్ నగర దృశ్యం.











ఇదే ఒలంపిక్ స్టేడియం టవరు.












ఇక మిగిలినవి Old port దృశ్యాలు. మన సాంస్కృతిక నగరాలు కూడా ఇలా పరిశుభ్రంగా, అహ్లాదకరంగా ఉండాలన్నదే నా ఆశ.























































ఇలాంటి గుర్రపుబళ్ళు ఎక్కి పాత నగరాన్ని ఎంచక్కా తిరిగేయొచ్చు. మరి వస్తారా???

Sunday, November 11, 2007

డబ్బు గురించి...

దీపావళి పండుగ బాగా జరిగిందనుకుంటాను. టపాసులు బాగా కాల్చారా? నా వరుకు నేను దీపాలు వెలిగించి, పిండి వంటలు చేసుకుని, భక్తి సినిమాలు చూసి పూర్తిచేసాను,

సరే ఇక విషయానికొస్తే, భారతదేశంలో ఆర్థిక సంస్కరణల గురించి, పెరుగుతున్న సెన్సెక్స్ గురించి బోలెడన్ని కబుర్లు వార్తల్లో వస్తుంటాయి కదా? వాటి గురించే అప్పుడప్పుడు నా మనుసులో ఉన్న కొన్ని సందేహాలు. నాకు ఈ షేర్ మార్కెట్ల గురించి తెలియదు. నాకు సంబంధించినంతవరకు ఎకనామి అంటే నా జీతం, దాన్ని నేను ఖర్చు చేసే విధానం. సెన్సెక్స్ దూసుకుపోతోందని చిదంబరంగారైతే సంబర పడిపోతున్నారుగాని, దానికంటే వేగంగా పెరిగే ధరల సూచి నన్ను దిగాలు పెడుతున్నది. సెన్సెక్స్ పెరుగుదల వల్ల నా జీతం పెరిగిందో లేదో తెలియదుగాని, ధరల పెరుగుదల వల్ల నా జేబుకు చిల్లులు పడుతున్న సంగతి మాత్రం బాగా తెలుస్తున్నది.

ఎవరిని ఉద్దేశించి ఈ ఆర్థిక సంస్కరణలు మొదలు పెట్టారో వారికి వాటి ఫలాలు అందుతున్నాయా అనది ప్రశ్న. ఉదాహరణకు ఇక్కడ ఆహార ఖర్చు జీతంలో 7 శాతం కాగా ఇండియాలో 12 శాతం. ఆహార స్వయం సమృద్ధి సాధించామనే దేశంలో ఇలాంటి పరిస్థితి ఎందుకో? పండించిన రైతు సరైన ధర లేక చస్తుంటే, మార్కెట్లో ఉన్న ధర పెట్టి కొనలేక మనం చస్తున్నాము. ఇక్కడ పెట్రోలు ధర లీటరుకు రమారమి 40-42 (రూపాయల్లో) ఉంటే, ఇండియాలో 50 పైమాటే. అయినా ప్రభుత్వం సబ్సిడి ఇవ్వలేక సతమతమవుతుంది, పెట్రోలియం కంపెనీలు నష్ట పడతాయి. ఏమిటో ఈ ’చిదంబర’ రహస్యం. చమురు మీద రూపాయి టాక్సు పెట్టి, పది పైసల సబ్సిడి ఇచ్చే విధానాల వల్ల ఉపయోగం లేదు. ప్రభుత్వం ధరలను అదుపులో పెట్టగలిగితే ప్రజలు ఆదాయ పన్ను ఎగ్గొట్టటం తగ్గుతుందేమో?

ఇక ముక్త విఫణి గురించి. ఆర్థిక సంస్కరణల వల్ల ముక్త విఫణి ఏర్పడి ప్రజలకు దానివల్ల మంచి జరిగిన మాట నిజం. లేకపోతే ఇంకా మారుతి కార్లు ఓ పాతికవేలు ఎక్కువ ధర ఉండేవి. ఇప్పుడు మనకు ఏమి కొనాలన్నా బోలెడంత చాయిస్. కాని రెండు నెలల క్రితం నేను ఇండియా వెళ్ళినప్పుడు గమనించిన విషయం చాలా బాధపెట్టింది. మీరెప్పుడైనా సూపర్ మార్కెట్ల ధరల గురించి ఆలోచించారా? వారి ధరలు ఇక్కడి ధరలతో పోటీ పడుతుంటాయి. మన్నిక కూడా అంతంత మాత్రం. ఇక్కడ కొన్ని షాపుల్లో Expiry date దగ్గర పడ్డ వస్తువులను తక్కువ ధరకు, ఒక్కోసారి సగం ధరకు అమ్ముతారు. ఎలెక్ట్ర్రానిక్ వస్తువులైతే ధరల తగ్గుదల నుండి రక్షణ ఉంటుంది. అంటే వస్తువు కొన్న తర్వాత నిర్ణీత సమయంలో వస్తువు ధర తగ్గితే, తగ్గినంత మేర డబ్బును మీకు బిల్లు చూపితే వెనిక్కిస్తారు. ఇలాంటి సదుపాయం మనకు ఉన్నదా? అడ్విటైజ్ మెంట్లో లేని షరతులు షాపుకొచ్చాక చెప్పటం, లేకపోతే స్టాకు అయిపోయిందనటం వినియోగదారుల నమ్మకాన్ని పోగొడతాయి. కొన్ని సూపర్ మార్కెట్లు సామాన్లు టోకున కొంటే తక్కువ ధరకిస్తామని ప్రచారం చేస్తుంటాయి. మనం టోకున కొనేలాగుంటే మన వీధి చివరనుండే అంగడతను కూడా ఆ మాత్రం తగ్గింపు ఇవ్వగలడు. ఆలోచించండి. ఇలాంటి మార్కెట్లకు ఇచ్చే ప్రోత్సాహం భావ్యమా?

చివరగా చిన్న విషయం. దీపావళి పండుగ సందర్భంగా జైనులు గోపూజ చేయటం టీ.విలో చూపారు. కొద్దిమంది ఆవులకు బన్నులు, అరటి పళ్ళు పెట్టటం చూసాను. వాటిని ఏ పేదవారికో పంచి ఆవులకు గడ్డి పెడితే రెండు విధాలుగా పుణ్యం దక్కేదేమో ఆలోచించగలరు.

మన డబ్బు మనం ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు. కాని, ఆ చేసే ఖర్చు మనకేకాకుండా సాటివారికి, దేశానికి, పర్యావరణానికి సహాయకారిగా ఉంటే అంతే చాలు. అందరికీ లక్ష్మీ కటాక్షం కలుగుగాక.

Thursday, November 8, 2007

దీపావళి శుభాకాంక్షలు.

అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.


ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ದೀಪಾವಳಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು. ಈ ದೀಪಾವಳಿ ಹಬ್ಬ ನಮ್ಮೆಲ್ಲರ ಜೀವನದಲ್ಲಿ ಹರುಷ ತರಲೆಂದು ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಬಯಸುತ್ತಿದ್ದೇನೆ.

Wednesday, November 7, 2007

బియ్యం బాధ

మళ్ళీ కల్సుకున్నందుకు సంతోషం. దీపావళి సందడి మొదలై ఉంటుందనుకుంటాను. ఇండియాలో ఉంటే బాగుండేది. టపాసులు కాల్చుకునేవాడిని. ఇక్కడ చలికి బిగిసుకుపోతున్నామంటే నమ్మండి.

అన్నట్లు ఆంధ్రాలో వరికి వెయ్యి రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్త. వెయ్యి ఇస్తే వినియోగదారుడికి కిలో బియ్యం ధర 20-25 రూపాయలకు పెరుగుతుందని ప్రధాని బాధ. మరి గోధుమ విషయంలో ఎంత ధర పెరిగిందో ఏ వార్తా పత్రిక కూడా చెప్పలేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు. ఐనా ధరల అదుపు ప్రభుత్వ బాధ్యత కాదా? ఏది ఎలా ఐనా మధ్యలో పభుత్వం బియ్యం ఎగుమతి ఆపినందువల్ల ఇక్కడ మాకు బియ్యం కరువు ఏర్పడి ధర రెండింతలైంది. మరి మా బాధ ఎవరికి చెప్పుకోము? అన్నం తప్ప బర్గర్లు తిని బ్రతకడం ఇంకా నేర్చుకోలేదు. ఇక తప్పదనుకుంటా.


సరే ఇక విషయానికి వస్తే, ముందుగా ఇక్కడ ఆకట్టుకునేది రహదారుల మీద క్రమశిక్షణ. హారన్ మోత ఎప్పుడోగాని వినపడదు. నిదానంగా వెళ్ళే వాహనాలు ఒక లేన్లో వెళ్తుంటే, వాటి దాటుకుని వెళ్ళే వాహనాలు పక్క లేన్ వాడుకుంటాయి. మన దేశంలో కూడా అలా చేయకుండా ముందున్న వాహనం తప్పుకునేదాకా హారన్ మోగిస్తూ చిరాకు పెడ్తుంటారు. రోడ్లు కూడా బాగుంటాయి. గంటకు 120 కి.మి. వేగంతో కూడా కుదుపులు లేకుండా ప్రయాణించవచ్చు.

మాంట్రియాల్ నగరంలో ఎక్కువగా మాట్లేడేది ఫ్రెంచ్. సిటిలో అయితే ఇంగ్లీష్ అర్థం చేసుకుంటారుగాని కొంచెం లోతట్టు ప్రాంతాలకు వెళ్తే ఫెంచే గతి. కాని, ఎవరినైనా చిరునవ్వుతో పలుకరించే జనం. ఉరుకులు, పరుగులకు దూరంగా ఉన్న జీవన శైలి మనల్ని ఇబ్బంది లేకుండా చూస్తాయి. జనంతో కలసి పోవడం చాలా తేలిక. నగరానికి దూరంగా ఉన్న ఊళ్ళు మన పల్లెలను పోలి ఉంటాయి. పేరుకు పల్లెలేగాని అన్ని వసతులు ఉంటాయి. 24 గంటలు ఉండే కరెంట్, నీరు గమనించవలసిన మరో విషయం.

సరే మళ్ళీ కలుసుకున్నప్పుడు మరిన్ని విషయాలు.

మరొక ముఖ్య విషయం, తెలుగులో వ్రాయడానికి లేఖినిలాగే పనిచేసే మరొక తంత్రాశం బరహ. బరహ IME వాడుకుని ఎక్కడైనా తెలుగులో వ్రాసుకోవచ్చు. బ్రౌజర్ తో పని లేదు. వివరాలకు వెబ్ సైట్ చూడండి. www.baraha.com

Sunday, November 4, 2007

నా పరిచయం

ముందుగా నా పరిచయం,

నా పేరు రాజశేఖర్. నేను వృత్తిరిత్యా మెకానికల్ ఇంజనీరుని. నా ప్రస్తుత నివాసం కెనడాలోని మాంట్రియాల్. అలాగని ఎన్.ఆర్.ఐ కాను. అందరిలానే ఉద్యోగం కోసం ఇక్కడ వచ్చాను. ఆన్సైట్ అన్నమాట. ఇండియాలో నా ఉద్యోగం బెంగళూరులో. ఇది టూకీగా నా పరిచయం.

ఇప్పుడు ఈ బ్లాగెందుకయ్యా అంటే, నా గురించి నేను చేప్పుకోవటానికి, నా ఆలోచనలను అందరితో పంచుకోవటానికినూ. అందరిలాగానే నాకు కూడా బోలెడన్ని ఆశలూ, వాటి గురించి ఆలోచనలూ ఉన్నాయి. అంతేకాక అప్పుడప్పుడు సమాజం గురించి కూడా ఆలోచిస్తానన్న మాట. వాటన్నిటినీ ఇక్కడ అక్షర రూపం ఇవ్వటమే ఈ బ్లాగు ఉద్దేశం. సో, ఇక నా మనుసులో వచ్చిన వింత వింత ఆలోచనలు, ఊహలూ, అనుభూతులు చదవడనికి సిద్ధంగా ఉండండి.

సాధారణంగా ఉద్యోగంలో ఉన్నవారికి ఇష్టమైన టాపిక్ బాస్ మరియు ఆఫిస్. కెనడా ఆఫిస్ చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఇక్కడి పని వాతావరణం చాలా బాగా నచ్చింది. పని మధ్యలో ఎవరూ వచ్చి దిస్టర్బ్ చేయరు. ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు. బహుశా ఇదే కావచ్చు నన్ను ఇక్కడ ఇంత కాలం ఉంచింది. ముఖ్యంగా సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ నేర్చుకోవాలి. మధ్యాహ్నం కాఫి తాగుతూ బయట కిటకీలోనుండి రంగులు మారుతున్న చెట్లనూ, మంచుకు సిద్ధమవుతున్న అడవిని చూడటం నాకెంతో ఇష్టం. ఇంత ప్రశాంతంగా ఉంటుందని బెంగళూరులో ఎవరైనా అంటే నమ్మే వాడిని కాను. ముందుగా నేను మీతో ఇక్కడ గమనించిన మంచి విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను.

మళ్ళీ కలిసినపుడు మరిన్ని విషయాలు.

Welcome

నా మొదటి బ్లాగుకు స్వాగతం