Sunday, January 25, 2009

సాఫ్ట్ వెటకారాలు

ఈ మధ్య సాఫ్ట్వేర్ ఉద్యోగుల మీద వస్తున్న వెటకారాలు, వార్తలకు నా ప్రతిస్పందన ఇది. సాటివారు బాధల్లో ఉన్నారని కూడా చూడకుండా ఈ మధ్య వార్తా పత్రికల్లో వస్తున్న వెటకారపు ఆర్టికల్స్, దానికి కొన్ని బ్లాగుల్లో కొనసాగింపు చేస్తున్న విధానం చూస్తే బాధ కలుగుతుంది. సాటివారు తమ జీవన భృతి గురించి ఆందోళన పడుతుంటే వీరికందులో ఎడతెగని హాస్యం కనపడుతోంది.

ఇక సత్యం ఉదంతం బయటపడ్డప్పటినుంచీ మన పత్రికలు సత్యం మూసివేయటం ఖాయమని, ఉద్యోగులు చేత చిప్ప తప్పదని ఊదరగొట్టేస్తున్నాయి. సత్యం రాజు మోసం చేసినట్లు చెప్పబడుతున్న 7000 కోట్లు ఆయనొక్కడే సంపాదించింది కాదు. అది ఆ సంస్థలోని ఉద్యోగుల సంపాదన కూడా. అంత సంపద సృష్టించగలిగినవారు తమ భార్యా పిల్లలను పోషించుకోలేరా? అయినా సత్యం సంస్థ పోగొట్టుకున్నది సంపాదించిన డబ్బునే కానీ, సంపాదించే చేతులను కాదు. ఇప్పటీకీ ఆ సంస్థ ఉనికిలోనే ఉన్నది. ఆ ఉద్యోగులు ఇంకా సంపదను సృష్టిస్తూనే ఉన్నారు. అయినా కూడా వార్తా పత్రికలు ఇక ఉద్యోగుల పని అయిపోయిందనే అంటున్నాయి. సాధారణంగా ఇంట్లో దొంగలుపడి మొత్తం దోచుకుపోతే ఇంటివారు మరోసారి అలా జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటారేగానీ ఆ ఇంటిని కూలగొట్టేసి, రోడ్డున పడి అడుక్కుతినరు. వీరి బాధ అలా ఇంకా జరగలేదనా? ఆ సంస్థ ఉద్యోగుల, మదుపుదారుల మానసిక స్థైర్యాన్ని, శాంతిని పెంపొందించే విధంగా నాలుగు మాటలు చెప్పటం మంచిదికాదా?

ఆర్థిక మాంద్యంవల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడినా కేవలం సాఫ్ట్వేర్ రంగం మాత్రమే మునిగిపోయినట్లు వార్తాపత్రికలు కోలాహలం సృష్టిస్తున్నాయి. ఇవి కొందరికి శునకానందం కలిగిస్తోందనుకుంటాను. సాఫ్ట్వేర్ ఇంజనీరంటే కేవలం 3 నెలల కోర్సు చేసి వేల జీతం వచ్చే ఉద్యోగాన్ని అప్పనంగా కొట్టేస్తారనుకుంటారు. ఉద్యోగం తేలిగ్గానే దొరికినా దాన్ని నిలబెట్టుకోవటానికి అహర్నిశలు పాటు పడాల్సి ఉంటుంది. అనునిత్యం కొత్త కొత్త కోర్సులు చేయాలి. లేకపోతే 6 నెలల్లో నేర్చుకున్నది పనికి రాకుండా పోతుంది. ఇక జీతం సంగతి వస్తే, తీసుకున్నదానికంటే ఎక్కువే కష్టపడాల్సి ఉంటుంది. సహనం, ఏకాగ్రత కోల్పోకుండా గంటల తరబడి పని చేయాల్సి ఉంటుంది. ఇలా తమని తాము మలుచుకోలేనివారు ఈ రంగంలో చాలా త్వరగా తమ ఉద్యోగాలు కోల్పోతారు. ఈ రంగంలో ఉద్యోగాలు ఊడటం ఎంత సులభమో కొత్త ఉద్యోగాలు పుట్టుకురావటం కూడా అంతే సులభం. ఉన్న ఉద్యోగం ఎన్నాళ్ళుంటుందో తెలియని పరిస్థితి ఈ రంగంలో మామూలే కాబట్టి ఉద్యోగులు కూడా సహజంగానే ఇలాంటి విపత్కర పరిస్థితులకు సిద్ధపడే ఉంటారు. కాబట్టి వారు తమ పరిస్థిని చక్కదిద్దుకునేదాక మన అనవసర భయాలను వారి మీద, వారి కుటుంబసభ్యుల మీద రుద్దకుండా ఉంటే అదే వారికి మనం చేయగలిగే పెద్ద ఉపకారం.

వీలైనంత త్వరగా కష్టకాలం గడిచి అందరికీ మంచి రోజులు రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.

(నేను సాఫ్ట్వేర్ ఉద్యోగి కాదు. కానీ నా స్నేహితుల్లో చాలా మంది ఈ రంగంలో పనిచేస్తున్నారు. వారిని చూసిన తర్వాత ఇలా వ్రాయాలనిపించింది.)

Saturday, January 24, 2009

అన్నం పెట్టే అద్దె ఇల్లు

మేము అద్దె ఇల్లు వెదికేటప్పుడు జరిగిన సరదా సంఘటన. మా మేనేజరు-క్లయింట్ల సర్దుబాట్ల వల్ల ప్రతి సంవత్సరం కొత్త చోట్ల పని చేయవలసి ఉంటుంది. అందువల్ల అద్దె ఇల్లు వెతుక్కోవటం అన్న ప్రహసనం క్రమం తప్పకుండా ఉండేది. మేముండే క్వీబెక్ రాష్ట్రమంతా ఫ్రెంచి బాషాధిపత్యం. నేనేమో ఓ మూడు ముక్కల ఫ్రెంచితో జీవిత లాంచి నడుపుకునేవాణ్ణి. సరే, ఒక శుభదినాన ఇల్లు వెదుకుదామని నిశ్చయించుకుని, ఉండడానికి మంచి ప్రదేశమేదో మా ఆఫీసులో కనుక్కుని అక్కడ వెళ్ళాము. నా ఫ్రెంచి అర్థం చేసుకున్న పండితులు లోనికి రానిచ్చి ఇల్లు చూపించారు, అర్థంకాని అఙ్ఞానులు ఫోన్ నంబర్లు ఇచ్చి ఇంగ్లీషు వచ్చినవారితో తర్వాత మాట్లాడుకొమ్మన్నారు.

మరుసటి రోజు ఫోన్లు కొట్టడం ప్రారంభించాను. కొందరు అపాయింట్మెంట్లిచ్చారు. అలా సాఫీగా సాగిపోతున్న సమయాన... ఒక ఫోన్ సంభాషణ

నేను: బోజూ (ఫ్రెంచి నమస్కారం), నేను మీ ప్రకటన చూసి ఫోన్ చేస్తున్నా. మీ వద్ద అద్దె ఇళ్ళేవైనా....

అద్దెఇంటతను: ఓ తప్పకుండా. మీకే సైజు ఇల్లు కావాలి?

నేను: 3 1/2 (ఒకే పడకగది ఉన్న ఇంటిని ఇలా సూచిస్తారు.)

అద్దెఇంటతను: ఉన్నాయి. ఇల్లు చూడ్డానికి ఎప్పుడు వస్తున్నారు?

నేను:  అద్దెంతో చెపితే...

అద్దెఇంటతను: 800-900 డాలర్లు.

అద్దె చాలా ఎక్కువ చెపుతున్నాడనిపించి ఎయే సౌకర్యాలు ఇస్తున్నారని అడిగాను. ఇక్కడ కొన్ని లేదా పూర్తి ఇంటి సామాన్లతో కూడా ఇళ్ళు దొరుకుతాయి. కరెంటు, ఇంటిని వేడి చేసే ఖర్చులు కూడా అద్దెలోనే కలిపే అవకాశముంది.

అద్దెఇంటతను: స్టవ్వు, ఫ్రిడ్జు, కరెంటు, house heatingతో పాటు తక్షణ అవసరాలకు ఒక అంబులెన్సుతో పాటు రోజూ మూడు పూట్ల భోజనం.

ఒక్క క్షణం అతనేం చెపుతున్నాడో అర్థం కాలేదు. ఏంటీ, ఇల్లు అద్దెకు తీసుకుంటే మూడు పూట్ల భోజనం కూడానా. మరి మధ్యాహ్నం ఆఫీసులో ఉంటానే, భోజనం మిస్సయిపోతానే, అయ్యయ్యో అనుకుంటూ...

నేను:  రోజూ భోజనం పెడతారా??

అద్దెఇంటతను: అవునండి. కానీ శని, ఆదివారాలు మాత్రం కుదరదు. మీరే బయట భోజనం చేయాలి లేకపోతే ఇంట్లోనే వండుకోవాలి.

ఇలాంటి అద్దె ఇల్లు చేయి తప్పిపోకూడదనుకుంటూ, "మరి నాకు రోజూ మధ్యాహ్నం ఆఫీసు ఉంటుంది కదా? మరి నా మధ్యాహ్నం భోజనం సంగతి ఎలా?" అంటూ నసిగాను.

అద్దెఇంటతను: ఆఫీసా? మీరింకా పని చేస్తున్నారా??

ఎక్కడో ఏదో తేడా జరిగిందని మా ఇద్దరికీ అర్థం అయ్యింది. నేను అద్దె ఇల్లు ఎందుకు వెదుక్కోవలసి వచ్చిందో వివరంగా చెప్పాను. అప్పుడు అతను చెప్పాడు...

నేను ఫోన్ చేసింది వృద్ధాశ్రమానికని.

(ఇది నిజంగా జరిగిన సంఘటన. బిల్డింగ్ ముందున్న ఫ్రెంచి బోర్డు చదవలేక కేవలం ఫోన్ నంబరు మాత్రం వ్రాసుకుని రావటం వల్ల జరిగిని పొరపాటిది. నేను ఆయనకు క్షమాపణలు చెప్పుకుని ఫోన్ పెట్టేసాను. ఆ వృద్ధాశ్రమం ఇప్పుడున్న ఇంటికి దగ్గరే. మేము తర్వాత ఉండబోయేది ఇక్కడే అని నేనూ మా ఆవిడ నవ్వుకుంటుంటాము.)