Saturday, November 24, 2007

సెల్ ఫోన్ సరిగ్గా వాడుతున్నామా?

మనలో చాలామందికి సెల్ ఫోన్లు ఉన్నాయికాని వాటిని ఉపయోగించే విధానం మాత్రం కొద్దిమందికే తెలుసనిపిస్తుంది. నన్ను చిరాకు పెట్టిన సంగతేమిటంటే, వాటిని ఆఫీసులో ఉపయోగించే విధం. గంటల కొద్ది సమయం ఒక చేయి చెవికే అంటించేసి ఉంటుంది. ఆఫీసులో ఉన్నప్పుడు అంతసేపు పర్సనల్ విషయాలను ముచ్చటించుకోవటం అవసరమా అన్నది మనం నిర్ణయించుకోవాలి. ఇలా చేయటం వల్ల పని గంటలు వృధా కాదా?

మనలో చాలా మందికి ఉన్న అపోహ, ఫోన్ వస్తే దాంట్లో మాట్లాడటం తప్పదని. నిజంగానే అత్యవసర పరిస్థితుల్లో సెల్ ఫోన్ ఒక వరం. కాని వచ్చిన ప్రతి ఫోన్ కాలును పని మానుకుని మరీ తీసుకోవటం అవసరం లేదనుకుంటాను. నంబరు నోట్ చేసుకుని పనైంతర్వాత తీరిగ్గా ముచ్చటించుకోవచ్చు కదా?

ముఖ్యంగా మనం మన పని మానుకుని వేరేతని డెస్కు దగ్గర వెళ్ళి పని గురించి మాట్లాడేటప్పుడు అతనికి మధ్యలో ఫోన్ వస్తుంది. అది అతని స్నేహితుడు శుక్రవారం ఏ సినిమాకు వెళదామని అడగడానికో, మందు పార్టీ గురించో అయ్యుంటుంది. ఇతనేమో ’పనిలో ఉన్నాను, మళ్ళీ మాట్లాడత'నని అనకుండా అప్పుడే హస్కు వేసుకుంటాడు. అతని అత్యవసర సమావేశం అయ్యేదాక వేచి చూడాలి. అరికాలి మంట నెత్తికెక్కేదెప్పుడంటే, అతను ఫోన్ తాపీగా పెట్టేసి ’ఆ ఎక్కడున్నాం’ అనో ’సరే... ఇప్పుడేం చేద్దాం’ అని అన్నప్పుడు. అంతవరకు చెప్పిన దాన్నే మళ్ళీ రికార్డు వేయాలంటే ఎంత చిరాగ్గా ఉంటుందో చెప్పలేను. ఇలా చేయటం వల్ల ముగ్గురి సమయం వృధా అయ్యిందన్న ఇంగితం కూడా ఉండదు. బహుశా నేనూ కూడా పట్టించుకునేవాడిని కానేమో. కాని ఇక్కడ ఆఫీసు పధ్ధతులు చూసాక నాకు ఈ టపా వ్రాయాలనిపించింది. ఇక్కడ ఒక మనిషి మనవద్ద వచ్చి మాట్లాడుతున్నప్పుడు తమ సమయాన్నంతా అతనికే కేటాయిస్తారు. అతను చెప్పేదాన్ని శ్రద్ధగా వింటారు. మధ్యలో ఫోన్ వస్తే (సెల్ ఒకటే కాదు, ఆఫీసు ఫోన్ అయినా సరే) అది పర్సనల్ అయితేనో, ముఖ్యమైనది కాకపోతే, చేసిన వారి నంబరు నోట్ చేసుకుని కట్ చేసేస్తారు. ముఖ్యమైన కాల్ అయితే వీలైనంత త్వరగా ముగించి, క్షమాపణలు అడిగి సంభాషణ కొనసాగిస్తారు. మనం కూడా ఇలాంటి విషయాలను శ్రద్ధ తీసుకుని పాటిస్తే బాగుంటుంది. ఏమంటారు?

2 comments:

  1. చాలా బాగా చెప్పావు రాజ్,మనలో చాలమంధి కనీసం ఇంగిత ఙ్ణాణం లేకుండా ప్రవర్తిస్తారు. ఇలాంటి ఇంకొన్ని మీ ద్రుష్టికి వచ్చినవి తెలుపండి.సరిధిద్ధుకుంటాం...

    సుభాష్

    ReplyDelete
  2. మీ బ్లొగ్ చాలా బాగుందండి... ఈ సెల్ ఫొన్ గురించి చాలా బాగా చెప్పారు.. అప్పుడప్పుడు నేను కూడ తప్పు చేస్తుంటాను... ఇక నుండి చేయను..(మరి ముఖ్యమైన పని ఐతే తప్ప).

    ReplyDelete

మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియపరచండి.