Sunday, April 27, 2008

వసంతాగమనం

చూస్తూండగానే వసంతం వచ్చింది. అసలెప్పటికైనా కరుగుతాయా అనిపించేలా ఉన్నా మంచు కొండలను ఆనవాలు లేకుండా చేస్తూ, తెల్లటి మంచు పూలతో విరబూసి ఉన్న చెట్లకు రంగు రంగుల పూలను పూయించేందుకు వసంతం తరలి వచ్చింది. బద్ధకంగా ముడుచుకుని ఉన్న ప్రకృతి గోరు వెచ్చని ఎండకు ఒళ్ళు విరుచుకుని పచ్చని చిగుళ్ళతో వసంతానికి స్వాగతం పలకడానికి సిద్ధం అయింది. నల్లటి చలికోటులను వదిలి రంగు రంగుల సీతాకోక చిలుకల్లాంటి పిల్లలు బయట ఆడుకోవటానికి పరుగులు పెడుతున్నారు. స్థబ్దుగా ఉండే వీధులు జనసంచారంతో కళకళలాడుతున్నాయి. మా ఊరిలో నవ చైతన్యం తొణికిసలాడుతోంది. ఆ నవవసంతాగమనాన్ని మీతో ఇలా పంచుకుంటున్నాను.

blog1

మంచంతా కరిగిపోగా సువిశాలంగా కనపడుతున్న మా వీధి.

blog2

మా ఇంటి ముందున్న అడివి పల్చగా రంగులను అద్దుకుంటోంది. అన్నట్లు అందులో బోలెడన్ని ఆపిల్ చెట్లు ఉన్నాయి. ఈ వేసవికి ఆపిల్ ఊరగాయ పెట్టాలి. ఏమంటారు?

Sunday, April 20, 2008

బెంగళూరులో పిల్లలకు ఉచిత చికిత్స

బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఆస్పత్రివారు పిల్లలకు ఉచితంగా గుండెకు సంబంధించిన ఆపరేషన్లు చేస్తున్నారని తెలిసింది. ఆ ప్రకటన ఇక్కడ ఇస్తున్నాను. మీకు తెలిసినవారికి forward చేయగలరు.

heart1

Sunday, April 13, 2008

Amway నిజానిజాలు

మనకు తెలిసి మన బంధువులో, స్నేహితులో, ఇరుగు పొరుగులో చాలామంది Amway సంస్థ సభ్యులై ఉండవచ్చు. దీంట్లో చేరే చాలామంది తాము ఈ వ్యాపారం ద్వారా కోట్లు, లేదా లక్షలు సంపాదిస్తామని గాఢంగా విశ్వసిస్తుంటారు. కాని ఇదే వ్యాపారంలో సంవత్సరాల తరబడి కష్టపడి, ఉన్నత అంచెలను చేరిన ఒకాయన తన చేదు అనుభవాలను ఒక పుస్తక రూపంలో ప్రచురించారు. దాన్ని మీకు పరిచయం చేయటమే ఈ టపా ఉద్దేశం.

Merchants of Deception అనే ఈ పుస్తకాన్ని ఆమ్వే పేరిట జరుగుతున్న వ్యాపారాన్ని దాదాపు 10 సంవత్సరాల పాటు నిర్వహించి, అందులో ఉన్నత అంచెలను చేరి, అందులోని మోసాలను పరిశీలించిన Eric Scheibeler అనే ఆయన వ్రాసారు.

Eric ఉద్దేశం ప్రకారం ఈ వ్యాపారంలో నికరంగా సంపాదించేదేమీ ఉండదు. కేవలం ఎండమావులను తరుముతూ, అలసిపోతూ చివరకు ఉన్నదంతా పోగొట్టుకోవటం ఈ వ్యాపారంలో చాలా సాధారణం. కాని ఈ నిజాన్ని తెలుసుకోనీయకుండా చాలా పకడ్బందిగా వీరి శిక్షణ ఉంటుందని ఈ పుస్తకంలో వివరిస్తారు. ఈ వ్యాపారంలో చాలా మంది లక్షలకు లక్షలు సంపాదించినట్లు ప్రచారం చేస్తారు. కాని, నిజంగా ఆ లక్షాధికారుల సంపాదనలో కేవలం Amway వ్యాపారం ద్వారా సంపాదించింది 5 శాతం దాటదని ఎరిక్ చెప్తారు.

ఈ పుస్తకాన్ని ఆయన pdf రూపంలో ఉంచారు. http://www.merchantsofdeception.com/ పుస్తకం చదవదలచినవారు ఇక్కడ మీ email ID ఇస్తే మీకు పుస్తకం download చేసుకోవటానికి ఒక link పంపబడుతుంది.

మనకు తెలిసినవాళ్ళల్లో చాలా మంది ఈ Amway సభ్యులుగా ఉండవచ్చు. మనం వారిని వస్తువులు అంటగట్టే అమ్మకందార్లుగా భావించి ఆట పట్టించటమో, తప్పుకు తిరగటమో చేస్తుంటాము. అలాంటి వారు మీకు తారసపడితే వారికి ఈ పుస్తకం గురించి చెప్పండి. నిజంగానే ఈ వ్యాపారంలో ఉన్నవారందరూ లక్షలు సంపాదిస్తుంటే సంతోషమే. అలాకాక నష్టపోతూ కూడా ఆ నిజాన్ని తెలుసుకోలేక ఇంకా ఇందులో పెట్టుబడి పెడుతుండేవారి కోసమే ఈ పుస్తకం. మనకు తెలిసినవారెవరైనా ఈ సంస్థ సభ్యులుగా ఉంటే, వారికి ఈ పుస్తకం గురించి చెబుదాము. నిజానిజాలను వారే తెలుసుకుంటారు. ఏమంటారు?

Sunday, April 6, 2008

సర్వధారి ఉగాది శుభాకాంక్షలు

నా చిన్నప్పుడు మా  అవ్వగారింటికి ప్రతి సంవత్సరం వేసవి శెలువులకు వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఒకరోజు నేను స్కూల్లో కొత్తగా నేర్చుకున్న science పాండిత్యాన్ని మా అవ్వగారికి చూపించాలని ’అవ్వా, సూర్యోదయం, సూర్యాస్తమయం ఎందుకయితాయో తెలుసా?’ అని అడిగాను. అందుకు మా అవ్వ ’భూమి మీద ఉన్న మంచివారిని చూడటానికే సూర్య, చంద్రులు వస్తారు. వర్షాలు కురుస్తాయి, భూమి పండుతుంది. మంచితనం వల్లే అంతా సక్రమంగా నడుస్తుంది.’ అని.

అలాంటి మంచివారు విరివిగా ఈ భూమి మీద పుట్టుకురావాలని, ఉన్నవారందరూ మంచితనాన్ని వ్యాపింపజేయాలని ఆశిస్తూ, అందరికీ సర్వధారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందిస్తున్నాను.