Wednesday, November 7, 2007

బియ్యం బాధ

మళ్ళీ కల్సుకున్నందుకు సంతోషం. దీపావళి సందడి మొదలై ఉంటుందనుకుంటాను. ఇండియాలో ఉంటే బాగుండేది. టపాసులు కాల్చుకునేవాడిని. ఇక్కడ చలికి బిగిసుకుపోతున్నామంటే నమ్మండి.

అన్నట్లు ఆంధ్రాలో వరికి వెయ్యి రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్త. వెయ్యి ఇస్తే వినియోగదారుడికి కిలో బియ్యం ధర 20-25 రూపాయలకు పెరుగుతుందని ప్రధాని బాధ. మరి గోధుమ విషయంలో ఎంత ధర పెరిగిందో ఏ వార్తా పత్రిక కూడా చెప్పలేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు. ఐనా ధరల అదుపు ప్రభుత్వ బాధ్యత కాదా? ఏది ఎలా ఐనా మధ్యలో పభుత్వం బియ్యం ఎగుమతి ఆపినందువల్ల ఇక్కడ మాకు బియ్యం కరువు ఏర్పడి ధర రెండింతలైంది. మరి మా బాధ ఎవరికి చెప్పుకోము? అన్నం తప్ప బర్గర్లు తిని బ్రతకడం ఇంకా నేర్చుకోలేదు. ఇక తప్పదనుకుంటా.


సరే ఇక విషయానికి వస్తే, ముందుగా ఇక్కడ ఆకట్టుకునేది రహదారుల మీద క్రమశిక్షణ. హారన్ మోత ఎప్పుడోగాని వినపడదు. నిదానంగా వెళ్ళే వాహనాలు ఒక లేన్లో వెళ్తుంటే, వాటి దాటుకుని వెళ్ళే వాహనాలు పక్క లేన్ వాడుకుంటాయి. మన దేశంలో కూడా అలా చేయకుండా ముందున్న వాహనం తప్పుకునేదాకా హారన్ మోగిస్తూ చిరాకు పెడ్తుంటారు. రోడ్లు కూడా బాగుంటాయి. గంటకు 120 కి.మి. వేగంతో కూడా కుదుపులు లేకుండా ప్రయాణించవచ్చు.

మాంట్రియాల్ నగరంలో ఎక్కువగా మాట్లేడేది ఫ్రెంచ్. సిటిలో అయితే ఇంగ్లీష్ అర్థం చేసుకుంటారుగాని కొంచెం లోతట్టు ప్రాంతాలకు వెళ్తే ఫెంచే గతి. కాని, ఎవరినైనా చిరునవ్వుతో పలుకరించే జనం. ఉరుకులు, పరుగులకు దూరంగా ఉన్న జీవన శైలి మనల్ని ఇబ్బంది లేకుండా చూస్తాయి. జనంతో కలసి పోవడం చాలా తేలిక. నగరానికి దూరంగా ఉన్న ఊళ్ళు మన పల్లెలను పోలి ఉంటాయి. పేరుకు పల్లెలేగాని అన్ని వసతులు ఉంటాయి. 24 గంటలు ఉండే కరెంట్, నీరు గమనించవలసిన మరో విషయం.

సరే మళ్ళీ కలుసుకున్నప్పుడు మరిన్ని విషయాలు.

మరొక ముఖ్య విషయం, తెలుగులో వ్రాయడానికి లేఖినిలాగే పనిచేసే మరొక తంత్రాశం బరహ. బరహ IME వాడుకుని ఎక్కడైనా తెలుగులో వ్రాసుకోవచ్చు. బ్రౌజర్ తో పని లేదు. వివరాలకు వెబ్ సైట్ చూడండి. www.baraha.com

No comments:

Post a Comment

మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియపరచండి.