దీపావళి పండుగ బాగా జరిగిందనుకుంటాను. టపాసులు బాగా కాల్చారా? నా వరుకు నేను దీపాలు వెలిగించి, పిండి వంటలు చేసుకుని, భక్తి సినిమాలు చూసి పూర్తిచేసాను,
సరే ఇక విషయానికొస్తే, భారతదేశంలో ఆర్థిక సంస్కరణల గురించి, పెరుగుతున్న సెన్సెక్స్ గురించి బోలెడన్ని కబుర్లు వార్తల్లో వస్తుంటాయి కదా? వాటి గురించే అప్పుడప్పుడు నా మనుసులో ఉన్న కొన్ని సందేహాలు. నాకు ఈ షేర్ మార్కెట్ల గురించి తెలియదు. నాకు సంబంధించినంతవరకు ఎకనామి అంటే నా జీతం, దాన్ని నేను ఖర్చు చేసే విధానం. సెన్సెక్స్ దూసుకుపోతోందని చిదంబరంగారైతే సంబర పడిపోతున్నారుగాని, దానికంటే వేగంగా పెరిగే ధరల సూచి నన్ను దిగాలు పెడుతున్నది. సెన్సెక్స్ పెరుగుదల వల్ల నా జీతం పెరిగిందో లేదో తెలియదుగాని, ధరల పెరుగుదల వల్ల నా జేబుకు చిల్లులు పడుతున్న సంగతి మాత్రం బాగా తెలుస్తున్నది.
ఎవరిని ఉద్దేశించి ఈ ఆర్థిక సంస్కరణలు మొదలు పెట్టారో వారికి వాటి ఫలాలు అందుతున్నాయా అనది ప్రశ్న. ఉదాహరణకు ఇక్కడ ఆహార ఖర్చు జీతంలో 7 శాతం కాగా ఇండియాలో 12 శాతం. ఆహార స్వయం సమృద్ధి సాధించామనే దేశంలో ఇలాంటి పరిస్థితి ఎందుకో? పండించిన రైతు సరైన ధర లేక చస్తుంటే, మార్కెట్లో ఉన్న ధర పెట్టి కొనలేక మనం చస్తున్నాము. ఇక్కడ పెట్రోలు ధర లీటరుకు రమారమి 40-42 (రూపాయల్లో) ఉంటే, ఇండియాలో 50 పైమాటే. అయినా ప్రభుత్వం సబ్సిడి ఇవ్వలేక సతమతమవుతుంది, పెట్రోలియం కంపెనీలు నష్ట పడతాయి. ఏమిటో ఈ ’చిదంబర’ రహస్యం. చమురు మీద రూపాయి టాక్సు పెట్టి, పది పైసల సబ్సిడి ఇచ్చే విధానాల వల్ల ఉపయోగం లేదు. ప్రభుత్వం ధరలను అదుపులో పెట్టగలిగితే ప్రజలు ఆదాయ పన్ను ఎగ్గొట్టటం తగ్గుతుందేమో?
ఇక ముక్త విఫణి గురించి. ఆర్థిక సంస్కరణల వల్ల ముక్త విఫణి ఏర్పడి ప్రజలకు దానివల్ల మంచి జరిగిన మాట నిజం. లేకపోతే ఇంకా మారుతి కార్లు ఓ పాతికవేలు ఎక్కువ ధర ఉండేవి. ఇప్పుడు మనకు ఏమి కొనాలన్నా బోలెడంత చాయిస్. కాని రెండు నెలల క్రితం నేను ఇండియా వెళ్ళినప్పుడు గమనించిన విషయం చాలా బాధపెట్టింది. మీరెప్పుడైనా సూపర్ మార్కెట్ల ధరల గురించి ఆలోచించారా? వారి ధరలు ఇక్కడి ధరలతో పోటీ పడుతుంటాయి. మన్నిక కూడా అంతంత మాత్రం. ఇక్కడ కొన్ని షాపుల్లో Expiry date దగ్గర పడ్డ వస్తువులను తక్కువ ధరకు, ఒక్కోసారి సగం ధరకు అమ్ముతారు. ఎలెక్ట్ర్రానిక్ వస్తువులైతే ధరల తగ్గుదల నుండి రక్షణ ఉంటుంది. అంటే వస్తువు కొన్న తర్వాత నిర్ణీత సమయంలో వస్తువు ధర తగ్గితే, తగ్గినంత మేర డబ్బును మీకు బిల్లు చూపితే వెనిక్కిస్తారు. ఇలాంటి సదుపాయం మనకు ఉన్నదా? అడ్విటైజ్ మెంట్లో లేని షరతులు షాపుకొచ్చాక చెప్పటం, లేకపోతే స్టాకు అయిపోయిందనటం వినియోగదారుల నమ్మకాన్ని పోగొడతాయి. కొన్ని సూపర్ మార్కెట్లు సామాన్లు టోకున కొంటే తక్కువ ధరకిస్తామని ప్రచారం చేస్తుంటాయి. మనం టోకున కొనేలాగుంటే మన వీధి చివరనుండే అంగడతను కూడా ఆ మాత్రం తగ్గింపు ఇవ్వగలడు. ఆలోచించండి. ఇలాంటి మార్కెట్లకు ఇచ్చే ప్రోత్సాహం భావ్యమా?
చివరగా చిన్న విషయం. దీపావళి పండుగ సందర్భంగా జైనులు గోపూజ చేయటం టీ.విలో చూపారు. కొద్దిమంది ఆవులకు బన్నులు, అరటి పళ్ళు పెట్టటం చూసాను. వాటిని ఏ పేదవారికో పంచి ఆవులకు గడ్డి పెడితే రెండు విధాలుగా పుణ్యం దక్కేదేమో ఆలోచించగలరు.
మన డబ్బు మనం ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు. కాని, ఆ చేసే ఖర్చు మనకేకాకుండా సాటివారికి, దేశానికి, పర్యావరణానికి సహాయకారిగా ఉంటే అంతే చాలు. అందరికీ లక్ష్మీ కటాక్షం కలుగుగాక.
Sunday, November 11, 2007
Subscribe to:
Post Comments (Atom)
బ్లాగ్లోకానికి స్వాగతం.
ReplyDeleteమీ ఆలోచనలు అభివ్యక్తి బాగున్నాయి.
అలాగే మాంట్రియాల్ లో మీ అనుభవాల గురించి కూడా రాస్తుండండి.
చక్కగా రాస్తున్నారు...
ReplyDeleteమీ భాష బాగుంది ఎక్కువ తప్పులు లేకుండా. (అప్పుతచ్చులు)
meeru chalabaga rastunnaru
ReplyDeleteకొత్తపాళీగారికి, ప్రవీణ్ గారికి నా బ్లాగుపై వ్యాఖ్యలు వ్రాసినందుకు ధన్యవాదాలు. చాలా ఉత్సాహంగా అనిపించింది. ఇక మీదట కూడా మీ అభిప్రాయలను తెలియపరుస్తుందండి.
ReplyDeletenice one raj good writing
ReplyDelete