Saturday, May 31, 2008

నా నడక దారి

నేను అప్పుడప్పుడు నడక కోసం వెళ్ళే అడివి దారి ఫోటోలివి. ఎలా ఉన్నాయి?

blog2

మొన్నటిదాకా మోకాలెత్తు మంచుతో కప్పబడి, ఇప్పుడు వెచ్చటి ఎండలో హాయిగా ఉన్న నడక దారి. ఇలాగే అడివిలో చాలా దూరం వరకు ఉంటుంది. చాలా చీలిక దారులతో గజిబిజిగా ఉంటుంది.

blog3

blog1

ఇది అడివిలో విరివిగా కనిపించే పూలచెట్టు. ఈ పూలు చాలా సువాసనగా ఉంటాయి. కనీసం ఇలాగైనా నా బరువు అదుపులో వస్తే అంతే చాలు.

Saturday, May 24, 2008

సాయంత్రం 9:00 గంటలు

ఇదేమిటి సాయంత్రం 9 గంటలంటున్నాడు అనుకుంటున్నారా? నిజమేనండి. మా ఊళ్ళో వేసవిలో రోజు నిడివి బాగా పెరుగుతుంది. ఇంకో నెలాగితే సాయంత్రం 10 గంటలు కూడా అవుతుంది మరి. వేసవిలో మాకు ఉదయం 4.30 వెలుతురు రావటం ప్రారంభం అయి రాత్రి 10 దాటితేగాని చీకటి పడదు. అదే చలికాలమైతే ఉదయం 8 దాటితేగాని రాని వెలుగు సాయంత్రం 3.30కే వెళ్ళిపోతుంది. చలికాలంలో ఇంట్లోనే ఉండిపోవల్సి ఉంటుంది. బయట కాలు పెట్టడం ఎంతో అవసరం ఉంటే తప్ప జరగదు. -35 డిగ్రీల చలిలో, జోరుగా గాలి వీస్తుంటే, మోకాళ్ళ లోతు మంచులో నడవటం అనుభవిస్తేగానీ తెలియదు. "ఎముకలు కొరికే చలి", "కొయ్యబారిపోవటం" అంటే ఏమిటో గత 2 సంవత్సరాలలో బాగా అర్థం అయింది. అందుకే వేసవి మాకు చాలా ఆనందాన్నిస్తుంది. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయాలలో మా ఆఫీసు పనివేళలు. ఉదయం 6.30కు ప్రారంభమై సాయంత్రం 3.30 ముగుస్తుంది. ఎవరూ కూడా ఆయాసపడిపోతూ గంటలకొద్ది పనిచేయరు. ముఖ్యంగా ఎంత freshగా వెళ్తామో, అంతే freshగా తిరిగి వస్తాము. అందువల్ల నేను సాయంత్రం 4 గంటలకే ఇంటికి దిగబడిపోయి, కాస్త ఫలాహారాన్ని లాగించి, మా ఇంటి పక్కనే ఉన్న అడివిలో నడకకో, దగ్గరలో ఉన్న నదీ తీరానికో, వీధుల వెంబడి వ్యాహళికి వెళ్ళటం అలవాటయ్యింది. జీవితాన్ని ఇలా కూడా అహ్లాదంగా గడపవచ్చన్న విషయం ఇక్కడ వచ్చాకే అర్థం అయింది. ఒక్కోసారి ఇండియా వెళ్ళాక మళ్ళీ ఆ ఉరుకుల పరుగుల జీవితంలో ఇమడగలనా అని భయమేస్తుంది. ఉందిలే మంచి కాలం ముందు ముందునా.. అని పాడుకోవటం తప్ప ఏం చేయగలం చెప్పండి?

blog01

సాయంసంధ్యలో రూపు చెదిరిపోతున్న మేఘం.

ఈ ఫోటోను రాత్రి? 9 సూర్యుడి అస్తమయం తర్వాత తీసాను. ఊరికే బ్లాగులో పోస్టు చేస్తున్నాను.

Sunday, May 18, 2008

జైపూరుపై ఉగ్రవాద దాడి

గత మంగళవారం జైపూరులో ఉగ్రవాదులు పేల్చిన వరుస బాంబులవల్ల 75 మందికిపైగా చనిపోయారు. మామూలుగానే మన నాయకులు ఆ దాడిని ఖండించేసి చేతులు దులుపుకున్నారు. దాడి జరిగిన ప్రదేశంలోని దేవాలయంలో కూడా మరుసటి రోజున పూజలు యధావిధిగా జరిగాయి. ఇక ఇదే నగరంలో ఈ రోజు క్రికెట్ మ్యాచు జరుగుతోంది. దాడి జరిగిన ఆనవాలు మరో మంగళవారానికి మచ్చుకైనా కానరావు. మరో దాడి జరిగేవరకు హాయిగా నిదురపోవచ్చు.

దాడి చేసినది ఒక పొరుగుదేశపు ఉగ్రవాద సంస్థ అయితే దానికి తోడ్పడింది మరో పొరుగుదేశపు గూఢాచారి సంస్థ అని అనుమానం. మన పొరుగుదేశాలు తమ భూభాగంపై అనేక ఉగ్రవాద సంస్థలు శిక్షణా శిబిరాలు నడుపుతుంటే వాటిని అరికట్టకుండా వాటికి పరోక్ష మద్దతిస్తున్నాయి. ఏ దేశమైనా తన ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి పొరుగుదేశాలతో శాంతిని కోరదు. దేశంలో జరిగిన, జరుగుతున్న దాడులకు పొరుగుదేశపు ఉగ్రవాద సంస్థలే కారణమని తెలిసినా సదరు పొరుగుదేశంతో శాంతి, వ్యాపార చర్చలకు సిద్ధమయ్యే ప్రభుత్వాలకు ఇదెప్పుడు అర్థమవుతుందో? మూర్ఖ మిత్రుడు వివేకవంతుడైన శత్రువు కన్నా ఎక్కువ చెరుపు చేస్తాడు. కాబట్టి, ఇకనైనా ఆ మూర్ఖ మిత్రత్వం కోసం ప్రయత్నం మానుకుని, ప్రజల ప్రాణ రక్షణపై దృష్టి పెట్టవలసిందిగా ప్రభుత్వానికి నా మనవి.

Sunday, May 4, 2008

తిండిపోతు మధ్యతరగతి భారతం

నిన్నబుష్షయ్యగారు చేసిన వ్యాఖ్య బాధనిపించి ఈ టపా వ్రాస్తున్నాను. ప్రపంచ ఆహార సమస్యకు భారతదేశపు మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా తినటమే అని బుష్ గారు శెలవిచ్చారు. ఎవరికెలా అనిపించినా నాకు మాత్రం అధ్యక్ష ఎన్నికకు పన్నిన కుతంత్రం అనిపించింది.

అమేరికా డాలరు విలువ పడిపోవటం వల్ల ఆ దేశ సగటు పౌరుడి కొనుగోలు శక్తి తగ్గింది. మరో వైపు భారత్, చైనాలాంటి దేశప్రజలు కొనుగోలు శక్తిలో అమేరికా ప్రజలతో పోటీ పడుతున్నారు. అందువల్ల అమెరికా ప్రజ కొద్దిగా ఆర్థిక ఇబ్బందులకు లోనవుతోంది. దీంతో అమేరికా అధ్యక్ష ఎన్నికలలో ఆర్థిక పరిస్థితే కీలకమవబోతున్నది. ఇక అక్కడి ప్రభుత్వాలు ఇలాంటి సమస్యలకు బయట వేరెవరో కారణమని ప్రజలను నమ్మించటం అలవాటు చేసుకున్నాయి. ఆ ప్రయత్నంలో భాగమే ఈ వ్యాఖ్యలు. సంప్రదాయక వోట్లను పునాదిగా చేసుకున్న పార్టీకి చెందిన బుష్షయ్య మరెలా మాట్లాడతారనుకోగలం? అసలు ’భారతదేశపు మధ్యతరగతి ప్రజల సంఖ్య అమెరికా జనాభాకంటే ఎక్కువ’ అనటమే తమకు చెందాల్సిన ఆహారాన్ని వేరెవరో స్వంతం చేసుకున్నారన్న దురభిప్రాయాన్ని ప్రజలకు కలిగించటం కాదా? కొంపదీసి వారి ఆహారాన్ని మేము తిన్నామని రేపు దాడి చేయరు కదా? అసలు వారి అంతర్గత వైఫల్యాలకు వేరే దేశాలను బాధ్యులను చేసి దాడి చేయటమే వారి విదేశాంగ విధానం కదా.