Sunday, February 17, 2008

తెలుగు వికిలో మా ఊరును చేర్చానోచ్....

చివరకు ఎలాగైతేనేమి మా ఊరు గురించి తెవికిలో ఒక వ్యాసం సృష్టించగలిగాను. దీనికి ప్రేరణ ఈనాడులో వచ్చిన ముఖచిత్ర కథనం అయితే సహాయం వైజాసత్యగారిది. ఎలా వ్రాయాలో తెలియక సహాయం కోసం అడిగితే వైజాసత్యగారు సహాయపడ్డారు. అందుకు వారికి నా కృతఙ్ఞతలు.

మనం మన ఊరి గురించి గర్వంగా చెప్పుకోవాలి. మన ఊరు మన వ్యక్తిత్వంలో ముఖ్య భాగం. అందువల్ల మీరు కూడా మీ ఊరి గురించి మీకు తెలిసింది వ్రాయండి. మీకు అన్ని విధాలుగానూ సహాయం తెవికిలో దొరుకుతుంది. కేవలం బద్ధకంవల్ల మాత్రం మానేయకండి. కాస్త సమయం చేసుకుని మీ ఊరిని ప్రపంచానికి పరిచయం చేయండి.

మా ఊరి వ్యాసానికి ఇక్కడ లంకె ఇస్తున్నాను. ఎవరైనా ఈ వ్యాసానికి మార్పులు చేర్పులు చేయదలిస్తే నిరభ్యంతరంగా చేయవచ్చు లేదా నాకు ఇ-మెయిల్ పంపినా సరే.

http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A1%E0%B0%BF

Sunday, February 3, 2008

చిన్ననాటి సంగతులు

ప్రతివారికీ ఎప్పుడో ఒకప్పుడు తమ ఊరు ఙ్ఞాపకం వస్తుంది. నాకైతే ఈ ఆదివారం ఈనాడు ముఖచిత్ర కథనం చూసి, వికిపిడియాలో మా ఊరి గురించి వివరాలు చూద్దామని వెతికినప్పుడు మా ఊరు ఙ్ఞాపకం వచ్చింది. వికిపిడియాలో అయితే ఖాళీ కాగితం దర్శనమిచ్చింది. ఇక అక్కడ వివరాలు పొందుపరచవలసి ఉంది.

మా ఊరు అనంతపురం జిల్లా పెన్నా నది తీరాన ఉన్న పామిడి గ్రామం. నా చిన్నతనంలో పెన్నా నది చాలా బాగుండేది. విశాలమైన ఇసుక తిన్నెలు మా ఊరి పిల్లలందరికీ ఆట మైదానాలు. వర్షాకాలంలో మాత్రమే నిండుగా ప్రవహించే నది ఎండాకాలంలో మాత్రం పెనకచెర్ల డ్యాం నుండి వదలిన నీళ్ళతో చిన్న పాయగా ప్రవహించేది. వేసవి కాలం వచ్చిందంటే మాకు ఉదయాలు, సాయంత్రాలు నది ఒడ్డునే కాలక్షేపం. ఉదయం నదికి వెళ్ళి స్నానాలు చేసి భోగేశ్వర స్వామి గుడికెళ్ళి తర్వాత స్కూలుకు వెళ్ళేవాళ్ళం. మళ్ళీ సాయంత్రాలు ఆడుకోవటానికి నది తీరానికే. ఇక వర్షాకాలం వస్తే స్కూలుకు ఎటూ శెలువే కాబట్టి మళ్ళీ నదికే పరుగు. నదిలో ఈత కొట్టడం, పడవలు వదలటం, ఇసుకలో కబడ్డి ఆడటం మాకు ఇష్టమైన కార్యక్రమం. నది మధ్యలో కట్టిన చిన్న రామాలయం, ఆంజనేయ స్వామి గుడి శ్రీరామనవమి రోజున చాల సందడిగా ఉండేది. ఊరంతా సాయంత్రానికి అక్కడ చేరుకుని పండుగను ఉత్సాహంగా జరుపుకునేవారు. సంవత్సరానికి ఒక్కసారి నదికి అవతలి గట్టున ఉన్న రామేశ్వరుని దేవాలయానికి నడుస్తూ వెళ్ళటం కూడా నాకు బాగా గుర్తుంది. చిన్న ఊరు కావటం వల్ల ప్రతి ఒక్కరూ కావలసిన వాళ్ళే, బంధువులే.

మా ఊరికి ముఖ్య ఆకర్షణంటే భోగేశ్వర స్వామి ఆలయం. మా ఊరికి ఆ పేరు రావటానికి కూడా ఆ స్వామే కారణమంటారు. పామిడి నిజరూపం ’పాము ముడి’. లింగాకారంలో ఉన్న స్వామిని ఒక పాము ఎప్పుడూ చుట్టుకుని ఉండేదని, అందువల్ల ఆ ప్రదేశానికి పాము ముడి అని పేరు వచ్చిందని, కాల క్రమంలో అది పామిడి అయ్యిందనంటారు. స్వామి స్వయంభువని ఆ లింగం రోజు రోజుకీ పెరుగుతోందని నమ్మకం. నాకు సరిగ్గా తెలియదు. నేను హైస్కూలుకు రాగానే బెంగళూరుకు మకాం మారింది. తర్వాత నా విద్యాభ్యాసమంతా కర్ణాటకలో జరగటం, ఉద్యోగంలో మునిగి తేలుతూ చాలా సంవత్సరాల పాటు మా ఊరి వైపు వెళ్ళలేకపోయాను.

మొన్న ఇండియా వెళ్ళినప్పుడు ఆఫీసుకు 2 వారాల శెలువు పడేసి ఊర్లోనే ఉన్న చిన్నాన్న దగ్గరికి బయలుదేరాను. అనంతపురం దాటినప్పటి నుంచీ ఎప్పుడెప్పుడు ఊరు చేరుతానా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. కల్లూరు దాటిన వెంటనే పెన్నా నది మీద నుండి బస్సు వెళ్ళేది. బస్సు కిటకీనుండి నదిలో నీళ్ళు ఉన్నాయా లేవా అని చూసి, మరుసటి రోజు నది దండయాత్రకు బయలుదేరటం నా అలవాటు. బస్సు కల్లూరు దాటగానే పెన్నా ఇసుకతిన్నెల కోసం ఎదురుచూస్తున్నాను. ముళ్ళకంప చెట్లు దట్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడొస్తుంది అప్పుడొస్తుందని ఎదురుచూస్తునే ఉన్నా. బస్సు పామిడి చేరుకున్నది. నేను నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. పెన్న కనిపించలేదు. నేనేమైనా పొరబడ్డానా అని సందేహపడ్తూ ఇల్లు చేరుకున్నాను. తర్వాత చిన్నాన్న ద్వారా తెలిసినదేమిటంటే ఇసుకంతా అక్రమంగా తరలిపోయిందని. తరలించటానికి ఇసుక లేకపోయాక భూమి ఆక్రమణలకు గురైయింది. మిగిలిన స్థలమంతా ముళ్ళకంపలతో నిండిపోయి జనం అడుగుపెట్టడానికి అసాధ్యం అయిపోయిందని. ఇక రాముని, ఆంజనేయిని గుళ్ళ గురించి అడిగే ధైర్యం చేయలేకపోయాను. ఇక అక్కడ ఉన్నన్ని రోజులూ చాలా విసుగ్గా గడిచాయి. బంధువుల ఇళ్ళకు వెళ్ళటం బాగానే ఉన్నా నేనెంతో సమయం గడిపే స్నేహితుడు కనిపించకుండా పోయాడు.

నా చిన్ననాటి ఙ్ఞాపకాలు శాశ్వతంగా మనిషి స్వార్థం వల్ల పోగొట్టుకున్నాను. భవిష్యత్తులో మళ్ళీ పెన్న గలగలలు వింటానన్న ఆశ కూడా లేదు. ఇక కేవలం పెన్న నాలాంటివారి ఙ్ఞాపకాల్లోనే ప్రవహిస్తుందా?