సెయింట్ లారెన్స్ నది మధ్యలో ఉన్న సుందర ద్వీపనగరమే మాంట్రియాల్. యూరప్ బయట ఫ్రెంచ్ సంస్కృతికి ప్రధాన నగరంగా భాసిల్లుతోంది. చుట్టూ విశాలమైన నది ప్రవాహం కన్నుల పండుగ చేస్తూ జెట్ బోటింగ్ లాంటి క్రీడలకు ఆహ్వానిస్తుంటే, చిన్న చిన్న ద్వీపాలలో ఉండే అమ్యూజ్మెంట్ పార్కులు ఆటలాడుకోవటానికి ఉత్సాహపరుస్తాయి. ఇక సేదతీరటానికి ఉద్యానవనాలు సరేసరి. మాంట్రియాల్ కెనడా దేశపు క్వీబెక్ (Quebec) ప్రావిన్స్ కు చెందుతుంది మరియు కెనడా నాలగవ పెద్ద నగరంగా గుర్తించబడుతోంది.
వేసవి ఆటవిడుపుగా మాంట్రియాల్ నగరానికి గొప్ప పేరుంది. సూర్యకాంతి ఎక్కువసేపుండటం బాగా కలసి వచ్చే విషయం. వేసవిలో సూర్యుడు ఉదయం 5 కన్నా ముందే ఉదయించి రాత్రి 9.30 దాటాకగాని అస్తమించకపోవటంతో వేసవిలో ప్రతిరోజూ తిరునాల జరుగుతున్నట్లుంటుంది. వివిధ రకాల పండుగలతో, పెరేడ్లతో నగర ప్రధాన వీధి సెయింట్ కాథరిన్ మహా సందడిగా ఉంటుంది. ఒలంపిక్ స్టేడియం, బయోడోమ్, మౌంట్ రాయల్ లాంటి ముఖ్యప్రదేశాలే కాక మరెన్నో చూడదగ్గ ప్రదేశాలతో పర్యాటకులను అలరిస్తుంది.
ముఖ్యంగా బయోడోమ్ పిల్లలకు నచ్చుతుంది. ప్రపంచంలోని వివిధ రకాల అటవీ వాతావరణాలను ఇక్కడ కృతిమంగా సృష్టించారు. సముద్రపు వాతావణాన్ని, tropical, polar వాతావరణాలను, అక్కడ నివసించే చెట్లను, పక్షులను, జంతువులను ఇక్కడ ఉంచారు. నాకు బాగా నచ్చిన వాటిలో ఇది ముఖ్యమైనది.
మాంట్రియాల్ మరో ప్రధాన ఆకర్షణ Old Port . ఇది పురాతన ఫ్రెంచ్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. పడవపై విహార యాత్రలకు చాలా బాగుంటుంది. పురాతన కట్టడాలు ఈ ప్రాంతపు ప్రత్యేకత. ఇక చెప్పడమెందుకు చూసి ఆనందించండి. మరోసారి మరిన్ని విశేషాలతో..

ఇదే బయో డోమ్. చూడటానికి చిన్నదిగా కనిపించినా, సమస్త ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. వృక్ష, ప్రాణి, పక్షి ప్రపంచాలతో పాటు జల ప్రపంచం కూడా ఇక్కడ చూడ వచ్చు.



నాకు నచ్చిన ఫోటోల్లో ఇదొకటి. బాగుందా?

ఒలంపిక్ స్టేడియంనుండి మాంట్రియాల్ నగర దృశ్యం.

ఇదే ఒలంపిక్ స్టేడియం టవరు.
ఇక మిగిలినవి Old port దృశ్యాలు. మన సాంస్కృతిక నగరాలు కూడా ఇలా పరిశుభ్రంగా, అహ్లాదకరంగా ఉండాలన్నదే నా ఆశ.





ఇలాంటి గుర్రపుబళ్ళు ఎక్కి పాత నగరాన్ని ఎంచక్కా తిరిగేయొచ్చు. మరి వస్తారా???