Sunday, December 28, 2008

శిశిరపు రంగులు

చాలా రోజుల తర్వాత ఇప్పటికి టపా వ్రాయటం కుదిరింది. ఇండియా వెళ్ళిపోవటం దాదాపు ఖాయం అయిన తర్వాత కంపెని అవసరాల కోసం మరో 7-8 నెలల పాటు అక్కడే ఉండమని మా మేనేజరు చెప్పటంతోనూ, పాత ఇంటి లీజు ముగిసినందున మళ్ళీ అద్దె ఇల్లు వెతుక్కోవాల్సి వచ్చింది. గత 3 సంవత్సరాలలో మూడో అద్దె ఇంటిని దిగ్విజయంగా వెతుక్కుని చేరేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది.

ఇక్కడ కూడా చెట్లు ఆకులు రంగులు మారి చాలా అందంగా కనిపించాయి. తర్వాత మంచు కురవటం కూడా ప్రారంభం అయ్యింది. కొన్ని ఫోటోలు పంచుకుందామని ఈ టపా.

DSCN2931  శిశిరానికి స్వాగతం పలుకుతున్న చెట్లు.

DSCN2932DSCN2936

DSCN2938

DSCN2940

వర్ణరంజితంగా ఉన్న మా పాత ఇంటి వీధి.

DSCN2945

మా కొత్త ఇంటి కిటికినుండి కనిపిస్తున్న మంచు వర్షం.

ఇక ఈ మంచు కరిగి మళ్ళీ వేసవి ప్రారంభం అయ్యేవరకు నిరీక్షణ తప్పదు.

Tuesday, October 14, 2008

నానో కన్నా ముందుగా... నానో కన్నా చౌకగా... ఒరేవా సూపర్

ఇప్పటి వరకూ టాటావారి నానో కారే చౌకైనది అనుకునేవారికి ఒక వార్త. ఇప్పుడు నానో కారికన్నా చౌకగా, దానికంటే ముందే మార్కెట్లోకి మరో కారు రాబోతోంది. దాని పేరే ఒరేవా సూపర్ (Oreva Super). దీన్ని తయారు చేసింది అజంతా గ్రూప్స్. వీరు ఒక మాడలును తయారు చేసి అప్పుడే రాజ్కోట్ షోరూంలో ప్రదర్శనకు పెట్టారు. దీని వెల దాదాపు 85,000 నుండి 1,00,000 వరకు ఉండొచ్చని వార్త. ఆ వార్తను ఇక్కడ చూడండి. NDTV వారి వీడియో ఇక్కడ చూడవచ్చు.

Sunday, October 5, 2008

అడవి కాచిన ఆపిల్స్

మా ఇంటికి దగ్గర ఉన్న ఒక ఆపిల్ చెట్టు ఫోటో ఇది. ఈ సంవత్సరం ఆపిల్ పికింగ్ కు వెళ్ళటం కుదర్లేదు. ఆందుకని ఇలా సరిపెట్టామన్నమాట.

apple1

తోటల్లో అయితే గుత్తులు గుత్తులుగా ఉంటాయి.

apple2

Friday, September 19, 2008

Marine Land చూద్దాం రండి

మెరిన్ ల్యాండ్ అనబడే ఈ విహార స్థలి నయాగరా జలపాతానికి దగ్గరలోనే ఉన్నది. నయాగరా చూసిన తర్వాత తప్పకుండా చూసి ఆనందించాల్సిన ప్రదేశమిది. పిల్లలకు పెద్దలకు వినోదాన్ని పంచటానికి బోలెడన్ని రైడ్స్, డాల్ఫిన్ల ప్రదర్శన, వివిద రకాలైన తిమింగలాలను ఇక్కడ చూడవచ్చు. మరిన్ని వివరాలకి వికిపీడియా పుటను ఇక్కడ చూడండి.

అక్కడ తీసిన కొన్ని ఫోటోలు మీతో పంచుకుంటున్నాను.

DSCN2840

ఇక్కడ తిమింగలాల ప్రదర్శన జరుగుతుంది. శిక్షకులు వచ్చి నిర్ణీత సమయాలలో ప్రదర్శన ఇప్పిస్తారు.

DSCN2893

ఈ ప్రదర్శనలో తిమింగలం తన తోకతో నీటిని బాదుతూ చుట్టూ ఉన్న జనం నీళ్ళతో తడిచిపోయేలా చేస్తుంది. నీటీ నుంచి పైకెగిరి గిరికీలు కొట్టడం మరో అంశం. జనంపై నీళ్ళు పడేలా తోకతో నీటిని కొడుతున్న దృశ్యం పై ఫోటోలో చూడవచ్చు.

DSCN2842

ప్రదర్శన తర్వాత తీరిగ్గా తిరుగుతూ(ఈదుతూ) సేద తీరుతున్న నేస్తం.

DSCN2849

ఇక్కడి కొలనుల ప్రత్యేకత ఏమిటంటే ఇవి రెండు అంతస్తులుగా విభజించబడి ఉంటాయి. పైన మనకు సాధారణ కొలనులాగ కనిపిస్తుంది. అక్కడే ప్రదర్శనలు జరుగుతాయి. ఇక దిగువ అంతస్తు గాజుతో నిర్మించబడి లోపలినుండి జలచరాలను గమనించడానికి అనువుగా ఉంటాయి.

DSCN2869

ఇది తెల్ల తిమింగలం (Beluga Whale). వీటితో ఏ ప్రదర్శనలు చేయించ లేదు. కానీ చూడటానికి విచిత్రంగా కనిపించాయి.

DSCN2872

DSCN2858

ఇది మెరిన్ ల్యాండ్  రైడ్లలో ముఖ్య ఆకర్షణ. దీన్ని స్కై స్క్రీమర్ అని పిలుస్తారు. ఇది ఎక్కి పైవరకు వెళితే నయాగరా జలపాతం మొత్తం కనిపిస్తుందట. మేము దీన్ని ఎక్కేంత సమయం లేకపోవటంతో ముందుకు సాగాము. ఇది ఎక్కాలంటే ముందు ఇది ఉన్న చిన్న కొండలాంటిదాన్ని ఎక్కాలి మరి. ఇదే కాకుండా ఇంకా చాలా రైడ్స ఉన్నాయి. చిన్న పిల్లలకు కూడా చాలా రైడ్స్ ఉన్నాయి.

DSCN2879

DSCN2885

కేవలం జలచరాలే కాకుండా ఎలుగుబంట్లు, జింకలు కూడా ఉన్నాయి. జింకలను మనం ముట్టుకుని, వాటిని నిమిరి, మేత పెట్టేందుకు కూడా వీలుంది.

DSCN2903

ఇదే మెరిన్ ల్యాండ్కే ప్రధాన ఆకర్షణ. కింగ్ వడార్ఫ్ స్టేడియం. డాల్ఫిన్ల ప్రదర్శనా స్థలం. కేవలం డాల్ఫిన్లే కాకుండా సీల్స్, వాల్రస్లు కూడా ప్రదర్శనలో పాలు పంచుకుంటాయి.

DSCN2908

DSCN2923

ఇక ఈ షోకి సంబంధించిన వీడియోలు చూసే ముందు చిన్న మాట. కొన్ని వీడియోల నిడివి ఎక్కువగా ఉండటం వల్ల లోడు కావటంలో ఇబ్బందులు కలగవచ్చు. అందుకు ముందస్తు క్షమాపణలు.

ప్రేక్షకులలోనుండి ఒక పాప/బాబును పిలిచి ఆ పాప చేత డాల్ఫిన్ కు సూచనలు ఇప్పించి దాని చేత కొన్ని అంశాలను ప్రదర్శింపజేస్తారు. చివరగా ఒక డాల్ఫిన్ బూరను ఇచ్చి పంపుతారు.

తోకలూపుతూ బై బై చెపుతున్న డాల్ఫిన్లు.

వాల్రస్ ప్రదర్శన కూడా చూడండి మరి.

మధ్యాహ్నం వరకు అంతా తిరిగి చూసి సాయంత్రానికి మా ఊరికి తిరుగు ప్రయాణం కట్టాము.

 

Saturday, September 6, 2008

మరోసారి నయాగరా దర్శనం

గతవారం 3 రోజులు శెలవులు కలసి రావటం వల్లా, ఇక ఈ నెల్లోనే ఇండియా తిరిగి వెళ్ళే అవకాశం (మా మేనేజరు దయ, మా ప్రాప్తం) ఉండటం వల్లనూ ముచ్చటగా మూడోసారి నయాగరా విహార యాత్ర కుదిరింది. అక్కడి కొన్ని ఫోటోలు, వీడియోలు మీతో పంచుకుందామని ఇక్కడ ఉంచుతున్నాను. ఇంతకు మునుపు తీసిన నయాగరా ఫోటోలు నా పాత టపాల్లో ఉన్నాయి, ఆసక్తి ఉన్నవారు పాత పుటలు తిరిగేయగలరు.

DSCN2736

ఇది గుర్రపునాడాగా పిలువబడే జలపాతపు పాయ. ఇది కెనడా దేశపు భూభాగంలో ఉన్నది. జలపాతం దగ్గరకు బోటుల్లో వెళ్ళే సదుపాయం వేసవికాలంలో ఉంటుంది.

DSCN2739

ఇది అమెరికా దేశపు భూభాగంలో ఉన్న పాయ. అమెరికావాళ్ళు జలపాతానికి పక్కనుండి కిందకు దిగుతూ చూసే వీలున్నది.

DSCN2751

బోటులో అమెరికా వైపున్న జలపాతాన్ని ఫోటో తీశాను. సూర్యుడు జలపాతానికి ఎదురుగా ఉన్నప్పుడు జలపాతం నుండి ఎగిసిన నీటి తుంపరలలో అందమైన ఇందధనుస్సు ఏర్పడుతుంది.

DSCN2753

జలపాతాన్ని దగ్గరగా చూసి ఆనందిస్తున్న అమెరికా ప్రజలు.

DSCN2756

కెనడా దేశం వైపున్న జలపాతం. బోటు జలపాతానికి చాలా దగ్గరగా వెళుతుంది. దాదాపు జలపాతం మనమీదే దుముకుతున్నాదా? అనిపిస్తుంది.

DSCN2763

జలపాతపు నీటి తుంపరలు వర్షం పడినట్లు పడతాయి. అందువల్ల అందరికీ ప్లాస్టిక్ raincoats ఇస్తారు. జలపాతాన్ని దగ్గరగా చూసి ఆనందిస్తున్న మా సహ ప్రయాణీకులు.

DSCN2776

DSCN2777

గుర్రపు నాడా ఆకారంలో ఉన్న అగాధంలో దుముకుతున్న జలధార.

DSCN2790

రాత్రి రంగురంగుల విద్యుద్దీపాల కాంతిలో మెరిసిపోతున్న నయాగరా. రంగులు మారుస్తుంటారు. చూడటానికి చాలా బాగుంటుంది. కానీ తక్కువ కాంతిలో ఫోటోలు తీయటం నాకు రాదు.

DSCN2792

DSCN2812

జలపాతానికి దగ్గరలో ఉన్న స్కైలాన్ టవరునుండి నయాగరా జలపాతపు హొయలు.

DSCN2819

DSCN2830

ఇక నయాగరా జలపాతానికి దగ్గర ఉన్న Marine land ఫోటోలు, వీడియోలు నా మరుసటి టపాలో...

Saturday, August 23, 2008

కెన్యా పాడిన జనగణమన

కెన్యా ప్రజలు మన జాతీయ గీతం పాడిన వీడియో ఇది.  పొద్దుపోక అంతర్జాలాన్ని గాలిస్తుంటే ఈ వీడియో కనిపించింది. మీతో పంచుకుందామని ఇలా...

Saturday, August 2, 2008

కెనడా రాజధాని టోరోంటో???

కెనడా దేశపు రాజదాని టోరోంటో అని ఈ రోజు ఈనాడు వెబ్ సైటు చూసినప్పుడే తెలిసింది. వార్త ఇక్కడ చదవండి.

Eenadu news

వార్తకు లంకె ఇక్కడ ఇస్తున్నాను. ఒక ప్రముఖ వార్తాపత్రికలో ఇలాంటి తప్పు దొర్లటం ఆశ్చర్యం కలిగించింది.

Saturday, July 26, 2008

బెంగళూరు పేలుళ్ళు

బెంగళూరు నగరంలో నిన్న జరిగిన పేలుళ్ళు ఇద్దరిని బలి తీసుకున్నాయి. ఈ ఘాతుకానికి కారణమెవరో తెలియకపోయినా అనుమానాలు మాత్రం సిమి పైన ఉన్నాయి. బాంబులు తక్కువ శక్తివంతమైనవైనా వాటిని ఉపయోగించటంలో ఆధునిక technology వాడబడిందని వార్త. ప్రజలను భయభ్రాంతులను చేయటానికే వీటిని పేల్చారని అనుకుంటున్నారు. బహుశా బవిష్యత్తులో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడటానికే ఈ సన్నాహం అయుండవచ్చు. దాడులకు ప్రభుత్వ ప్రతిస్పందన గమనించి తమ భవిష్య పథకాలను పకడ్బందీగా రచించాలన్నది ఉగ్రవాదుల వ్యూహమైయుండవచ్చు. మరి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్య, ఐటి సంస్థలకు అధిక భద్రత కల్పిస్తామన్న ప్రకటన. ఐటి సంస్థలు సరే మరి సామాన్య పౌరుల విషయమేమిటి? ఇలాంటి దాడుల్లో ఎక్కువగా బలైయ్యేది వీరే కదా? ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే సంస్థలను నిషేధించినంత మాత్రానా సరిపోతుందా? దేశంలో జరిగిన అనేక ఉగ్రవాద దాడులకు కారణమైనవారు బెంగళూరులో తలదాచుకోవటం చాలా సంవత్సరాలుగా జరుగుతున్నది. ఇలాంటివారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ప్రభుత్వానికే తెలియాలి. నిషేధిత సంస్థల కార్యకలాపాలపైనా ఆర్థిక వనరులపైనా గట్టి నిఘా ఉంటే ఇలాంటి దాడులని అరికట్టే అవకాశం ఉంటుంది.

ఈ దాడుల్లో ఎక్కువగా ప్రాణనష్టం జరగకపోవటం ఊరటనిచ్చేదే అయినా ఈ ఊరట ఎన్నాళ్ళో? తన దౌర్బల్యానికి అమాయక ప్రజల ప్రాణాలు మూల్యంగా చెల్లించుకుంటున్నామన్న స్పృహ ప్రభుత్వానికి కలగాలని ఆశిస్తున్నాను.

Saturday, July 12, 2008

క్వీబెక్ జాతీయ దిన సంబరాలు-2

ఇంతకు ముందు టపా వ్రాసిన వెంటనే దీన్ని కూడా వ్రాద్దామనుకున్నాను. కాని పనుల వత్తిడి వల్ల ఇప్పటికి కుదిరింది.

క్వీబెక్ సంబరాల్లో భాగంగా ఒక చిన్న నృత్య కార్యక్రమం జరిగింది. ముందు ప్రదర్శకులు ఒక డాన్సు చేసి చూపించారు. తర్వాత వేదిక మీద ఒకావిడ స్టెప్పులు వేసి చూపిస్తుంటే కింద జనాలు ఒక్కొక్కరే దానికి అనుగుణంగా డాన్సు చేయటం మొదలుపెట్టారు. కొద్దిసేపట్లోనే దాదాపు అందరూ కలిసి ఒక్కటిగా నృత్యం చేయటం ముచ్చటగా అనిపించింది. వాటి ఫోటోలు ఇక్కడ పంచుకుంటున్నాను.

DSCN2677

వయసుకు ఉత్సాహానికి సంబంధముందంటారా?

DSCN2686

కలసి నడవటమే కాదు కలసి నర్తించటమూ ఆనందమే.

DSCN2691 మేమూ పాలు పంచుకుంటాము.

చాలామంది మమ్మల్ని కూడా జత కలవమని పిలిచారు. ఈ సారికి సిగ్గుపడి ఊరుకున్నాము కానీ వచ్చే సంవత్సరం ఇక్కడి జనాలకు ’చిరు’ స్టెప్పులు చూపాల్సిందే.

DSCN2695

Saturday, June 28, 2008

క్వీబెక్ జాతీయ దిన సంబరాలు

గత మంగళవారం క్వీబెక్ జాతీయ దినం. మా ఊళ్ళో చాలా చోట్ల సోమవారం సాయంత్రమే సంబరాలు జరిగాయి. ఆటలు, పాటలతో పాటు బాణాసంచా ప్రదర్శన కూడా జరిగింది. మామూలుగా అయితే రోడ్డు మీద ఒకరూ కూడా కనబడరుగాని ఈ సంబరాలలో పాల్గొనటానికి వచ్చిన వందల మందిని చూస్తే మన ఊరి తిరునాల ఙ్ఞాపకం వచ్చింది. ఇక ఈ క్వేబెక్ దినమేమిటంటే దానికి పెద్ద కథే ఉంది. ఆసక్తి ఉన్నవారు ఇక్కడ చూడగలరు.

సంబరాలు జరిగింది మా ఇంటి దగ్గరే ఉన్న ఒక కాలేజి మైదానంలో కాబట్టి నిదానంగా భోజనం చేసుకుని బయలుదేరాము. అప్పటికే పాటల కచేరి జరుగుతోంది. ఇక్కడ ఇబ్బందేమిటంటే కూర్చోడానికి కుర్చీలు ఉండవు. అందరూ నిలబడో, కింద కూర్చొనో చూడాలి. లేకపోతే మడత కుర్చీలో తీసుకురావాలి. మేము కూడా ఇలాంటి సందర్భాల కోసమనే అలాంటి కుర్చీలు కొన్నాము. మన సాంస్కృతిక కార్యక్రమాలలాగ సుత్తి కొట్టేవాళ్ళనెవరినీ పిలవలేదు. నాయకులు వేదిక మీద నిషిద్ధం. ఒక ముసలాయన పాటలు పాడుతూ తన బృందంతో గాత్ర కచేరి నడుపుతున్నాడు. వయసు 75 సంవత్సరాలని తర్వాత తెలిసింది. ఆయన ఉత్సాహం చూస్తే అలా అనిపించదు. ఫ్రెంచి పాటలు కాబట్టి పూర్తిగా అర్థం కాలేదు కాని సంగీతం బాగుండటంతో సమయం తెలియలేదు. పక్కనే అంగళ్ళు, చిరుతిండ్ల దుకాణాలు, గోల చేసే పిల్లలు, అచ్చం మన జాతరను తలపించింది. ఇంతలో మా ఆఫీసువాళ్ళు (కెనడావారే) వచ్చి కలిశారు. వారితో లోకాభిరామాయణం ప్రారంభమైంది. ఇక ఇక్కడ బీరు ఇలాంటి సందర్భాలలో తెగ తాగుతారు. నేను తాగను (రాజు మంచి బాలుడు). గత సంవత్సరం జగ్గుల్లో, మగ్గుల్లో తాగేవారు. అలా ఒకడు తన మగ్గు బీరుతో నాకు స్నానం కూడా చేయించాడులెండి. ఈసారి మాత్రం చిన్నచిన్న టిన్లతో సరఫరా చేసారు. బ్రతికిపోయాను. దాదాపు 10.45 బాణాసంచా కాల్చటం ప్రారంభమైంది. నాకు మాత్రం చాలా అద్భుతం అనిపించింది. దాదాపు 11.30 బాణాసంచా కార్యక్రమం పూర్తయి మళ్ళీ పాటలు ప్రారంభించారు. మేము మాత్రం ఇంటికి వచ్చి ముసుగుతన్నాము. ఇక మీకోసం ఫోటోలు, వీడియోలు ఇక్కడ ఉంచుతున్నాను. ఎలా ఉన్నాయో చెప్పండి.

DSCN2651

ఇదే స్వాగత ద్వారం.

DSCN2655

పాటల కచేరి. ఫోటో బాగా షేకయ్యింది. సారీ.

DSCN2662

వేల వేల వెలుగుపూలు.

DSCN2663

ఉవ్వెత్తున వెలుగులు చిమ్ముతున్న కారంజి. (ఇది fountainకు కన్నడ పదం. తెలుగులో ఏమంటారో తెలిసినవారు చెప్పగలరు).

Sunday, June 22, 2008

మా ఊరి రైతు బజారు

ప్రతి శనివారం మా ఊరి బస్టాండ్ దగ్గర ఉన్న రైతు బజారుకెళ్ళి కూరగాయలు, బ్రెడ్లు, పళ్ళు తెచ్చుకోవటం మా అలవాటు. ఇండియాలోలాగానే ఇక్కడ కూడా బేరాలాడుతూ, తెలిసిన రైతులను పలకరిస్తూ, వారు తెచ్చే కొత్త కొత్త బెర్రీలను రుచి చూస్తూ మార్కెట్ అంతా కలయతిరగటం బాగుంటుంది. ఇక్కడ ఇంకొక విషయమేమిటంటే చాలామంది ఆకుకూరలు, కూరగాయల మొక్కలను కొనుక్కుని వాటిని ఇంట్లో పెంచుతారు. వారికి అవసరం వచ్చాక వాటిని వాడుకుంటారు. ఇలాంటి వారి కోసం కూరగాయ మొక్కలు, పూల మొక్కలు కూడా ఇక్కడ అమ్ముతారు. ఇక maple syrup దొరికితే సంతోషమే సంతోషం.

ఇక ఇక్కడ ఉన్న ఇబ్బందల్లా మాకు ఫ్రెంచ్ బాష రాకపోవటం. అయినా వదలకుండా ఫ్రెంచి పదాలు, అంకెలు నేర్చేసుకుని, వేళ్ళు చూపిస్తూ ధరలను బేరమాడేస్తుంటాము. అంతా కొన్న తర్వాత దగ్గరలోని పార్కులో కాసేపు సేదతీరి ఇంటికి బయలుదేరుతాము.

మార్కెట్ ఇంటికి 2 కి.మి. దూరంలోనే ఉండటంవల్లా, వేసవి కావటంవల్ల నడుచుకుంటూ వెళ్తాము. ఆ దారంతా బెర్రీ మొక్కలు, ఆపిల్ చెట్లతో నిండి ఉంటుంది. ఆ దారిలో సైకిళ్ళు తప్ప మరే వాహనాన్ని అనుమతించరు. కాబట్టి ఆ దారి నిశబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆ నడక దారిలో బెర్రీ మొక్కలనుండి బెర్రీలను కొద్దిమంది సేకరిస్తుంటారు. మేము వారితో కలసి కొన్ని బెర్రీలను సేకరించి వాటిని తింటూ ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం దాటిపోతుంది.

ఇదే పని ఇండియాలో అయితే కంగారు కంగారుగా స్కూటరు మీద వెళ్ళి ఒక గంటలో కూరగాయలు కొనేసుకుని, గభాలున ఇంటికొచ్చేసి, టి.వి లకు అతుక్కుపోవటం చేస్తుంటాను. ఈ సారి అక్కడ వచ్చినప్పుడు నా పద్డతులు మార్చుకోవాలి.

DSCN2638

ఇదే మా ఊరి రైతు బజారు.

DSCN2644

కూరగాయల కోసం వచ్చినవారితో సందడిగా ఉన్న మార్కెట్. బారులు తీరిన కారులు, వ్యానులు.

DSCN2631

అమ్మకానికున్న పూల మొక్కలు. సగం సంవత్సరం మంచుతో కప్పబడి ఉండే ఈ దేశంలో తోటపని మీద వీళ్ళకున్న శ్రద్ఢ చూస్తే నాకు అబ్బురమనిపిస్తుంది.

DSCN2633

పళ్ళు తినటం ఇక్కడ అలవాటైన ఒక ఆరోగ్యకర అలవాటు.

DSCN2639

మా ఊరి జండా ఉన్న గోపురం. ఊరికి జండా ఏమిటని ఆశ్చర్యపడకండి. ఇక్కడంతే. మంగళవారం క్వీబెక్ జాతీయ దినం కోసం ఈ గోపురాన్ని, దాని వెనుక ఉన్న మైదానాన్ని ముస్తాబు చేస్తున్నారు. సోమవారం రాత్రి బాణాసంచా, ఆటలు, పాటలు, బీరు... అబ్బో చెప్పలేనంత సందడి. గత సంవత్సరం నాకు బీరు స్నానం కూడా అయింది. ఈ సారి ఎలా ఉంటుందో తర్వాత చెప్తానే.

Saturday, June 7, 2008

మెక్ డోనల్డ్స్ వారి ఇండియన్ వంటకాలు

Mc Donalds. Pizza hut లాంటి అంతర్జాతీయ fast food సంస్థలు ఇప్పటిదాక భారతీయులకు పిజ్జాలు, బర్గర్లు తినిపించాయి. ఇక భారతీయ వంటలను పిజ్జాల, బర్గర్ల రూపంలో మార్చేసి, పాశ్చాత్యదేశాలకు అందించబోతున్నారని వార్త.

మెక్ డోనాల్డ్స్ వారు Mc puff మరియు ఆలూ టిక్కా బర్గర్లు చేస్తుంటే పిజ్జా హట్ మరియు papa john's వారు టండూరి చికెన్ పిజ్జా అట. ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటిలు రాబోతున్నాయట. భలే... భలే. అమ్మకాలు, లాభాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయట.

ఏది ఏమైనా ఇడ్లీలు, వడలు, దోశెలు లాంటివి కూడా రూపు మారినా కనీసం రుచి మారకుండా వచ్చేస్తే నాలాంటి వారి నోటి కరువు తీరిపోతుంది.

ఇంతా చేసి సమోసాలను మరిచిపోయారేంటి చెప్మా? సరే నెమ్మదిగా అవి కూడా ఉప్మా పెసరట్టుతో పాటు వస్తాయేమో. ఉందిలే మంచి కాలం ముందు ముందునా.....

Saturday, May 31, 2008

నా నడక దారి

నేను అప్పుడప్పుడు నడక కోసం వెళ్ళే అడివి దారి ఫోటోలివి. ఎలా ఉన్నాయి?

blog2

మొన్నటిదాకా మోకాలెత్తు మంచుతో కప్పబడి, ఇప్పుడు వెచ్చటి ఎండలో హాయిగా ఉన్న నడక దారి. ఇలాగే అడివిలో చాలా దూరం వరకు ఉంటుంది. చాలా చీలిక దారులతో గజిబిజిగా ఉంటుంది.

blog3

blog1

ఇది అడివిలో విరివిగా కనిపించే పూలచెట్టు. ఈ పూలు చాలా సువాసనగా ఉంటాయి. కనీసం ఇలాగైనా నా బరువు అదుపులో వస్తే అంతే చాలు.