Sunday, June 21, 2009

సెంటు మాలక్ష్మి

పేరు చూసి ఇదేదో అత్తర్ల గురించి టపా అనుకునేరు. కాదండి, ఇది హండ్రెడ్ పర్సెంటు కెనెడియన్ డాలరులో వందో వంతైన సెంటు గురించే. కెనడా వచ్చిన కొత్తలో ఇత్తడి నాణెంలా ఉండే సెంటు పరిచయమైయ్యింది. ఇక్కడ అందరూ ’సరైన చిల్లర’ ఇచ్చి పుచ్చుకునేవారవటం చేత ఈ నాణెం వాడుకలో ఉంది. ఇది కేవలం సరైన చిల్లర ఇవ్వటానికే తప్ప మామూలు నాణెల్లా వాడలేమన్న సంగతి తెలుసుకునేసరికి నా చొక్కా, పాంట్ల జేబుల నిండుగా నిండిపోయింది. వీటిని నాణెల్లా కేవలం మనుషులు మాత్రమే గుర్తిస్తారు కానీ వెండింగ్ మెషిన్లు వీటి మింగేయటమో, ఉమ్మేయటమో చేస్తాయి. ఇది తెలుసుకునేసరికి కొన్ని నాణేలు చేజారిపోయాయి. పోనీ బస్సులో వాడుదామని బస్సెక్కి గుప్పిల్లతో నాణేలు మెషిన్లో పోస్తుంటే డ్రైవరు ముందు విస్తుపోయి తర్వాత చిద్విలాసంగా నవ్వి, ’నీ నాణేలు మా బస్సు కంపెనీకి డొనేట్ చేసావు పో’ అని చావు కబురు చల్లగా చెప్పి పుణ్యం కట్టుకున్నాడు. అలా చిల్లర ఏ గుడి మెట్ల దగ్గర పోసినా బోలెడంత పుణ్యం దక్కేది. ఇక్కడ పుణ్యమూ పోయె, పురుషార్థమూ పోయెనని వగచుచూ.... (బాబోయ్.. జరిగిన నష్టాన్ని తలుచుకుంటే గ్రాంథికం వచ్చేస్తోంది). ఇలా వేర్వేరు దారుల్లో బోలెడన్ని నాణేలు నష్టపోయాక, ఇంకేం చేయాలో తోచక సెంట్లను కూడబెట్టడం ప్రారంభించాను. ఇలా కూడబెట్టిన నాణేలతో ఒక పెద్ద సంచి నిండాక..... వంట బాగా కుదిరిన రోజున మా ఆవిడలు ఓ వంద వరహాలు (అదేనండి సెంట్లు) బహుమతి ఇవ్వటం, తనకు షాపింగ్లో నసగకుండ సహాయం చేసినప్పుడు తను నాకు ఓ యాభై వరహాలు (ఎంతైనా మా ఆవిడ పతిసేవకు (పతిసేవ అంటే... పతికి చేసిన సేవకాదు, పతి చేసిన సేవ... కాలం మారింది బాబులు) సరిగ్గా విలువ కట్టగలదు) బహుమతిగా ఇచ్చిపుచ్చుకునే అలవాటు చేసుకున్నాము. అందువల్ల ఇప్పుడు ఇద్దరిదగ్గర చెరో పెద్ద సంచెడు వరహాలు పోగుబడ్డాయి.

మొన్న ముసురు పట్టి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి మిరపకాయ బజ్జీలు తినాలనిపించింది. సీరియస్సుగా ఇంగ్లీషు సీరియల్ చూస్తున్న మా ఆవిడని చూస్తూ, ’ఇలా ముసురు పట్టి ఉన్నప్పుడు బజ్జీలు తింటే చాలా బాగుంటుంది కదా? నీవిప్పుడు బజ్జీలు వేసి పెడితే నీకు కాసుల పేరు చేయిస్తానే’ అని అన్నాను. మూతి ముప్ఫై వంకరలు తిప్పి ’పెళ్ళైన ఇన్నేళ్ళలో ఒక్క నగా చేయించ లేదుగానీ ఇప్పుడు బజ్జీల కోసం కాసులపేరు చేయిస్తారా?... అయినా కాసులెక్కడ ఉన్నాయో కాసులపేరు కోసం’ అంది ఎకసెక్కంగా. ’మనక్కాసుల కరువేంటి? ఇదిగో సంచుల కొద్ది ఉంటేనూ...’ అంటూ సెంట్ల సంచికేసి చూపించాను. ఆ సాయంత్రం ప్లేట్లో వేడి బజ్జీలతో పాటు అంతకంటే వేడిగా నెత్తి మీద మొట్టికాయలు తినాల్సి వచ్చింది. హాస్య ప్రియత్వం అనేది అందరికీ ఉండదు కదండీ ?!

(ఇది కేవలం తమాషాకు వ్రాసింది. మా ఆవిడ చాలా మంచిది. కేవలం బజ్జీలు మాత్రమే పెడుతుంది.)

4 comments:

  1. ayinaa...evarainaa cheppukuntaaraa, manchidani muktaayinchaka pote mudda(u) digadugaa...

    ReplyDelete
  2. chala bagundi :-)

    ReplyDelete
  3. ha ha ha.
    cool.
    You may enj
    http://kottapali.blogspot.com/2008/09/blog-post_11.htmloy this ..

    ReplyDelete
  4. @anonymous గార్లకు,
    మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు. మీ పేర్లతో వ్యాఖ్య వ్రాసి ఉంటే బాగుండేది కదా? ఫలానా వారికి నా టపా నచ్చిందని సంతోషించేవాడిని.
    @ కొత్త పాళీ గారికి,
    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete

మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియపరచండి.