Sunday, April 26, 2009

Space Race పుస్తక పరిచయం

Space Race పుస్తకాన్ని మీకు పరిచయం చేయటం కోసమే ఈ టపా. అంతరిక్షయాణాన్ని, తద్వారా చంద్రుణ్ణి తాకాలని కలలు కనే ఇద్దరు రాకెట్ ఇంజనియర్ల జీవిత చిత్రణే ఈ పుస్తకం.

ఒకరు జర్మన్ ఇంజనియరైన వెర్నెర్ వాన్ బ్రౌన్. ఈయన రెండవ ప్రపంచ యుద్ధకాలంలో హిట్లరు కోసం రాకెట్లను తయారుచేసేవాడు. గొప్ప గొప్ప రాకెట్లను తయారు చేసి తద్వారా అంతరిక్షాణ్ణి, తర్వాత చంద్రుణ్ణి, తదనంతరం సుదూర గ్రహాలకు ప్రయాణించాలనేది ఈయన కల. ఆ కలను సాకారం చేసుకోవాలంటే తగిన వనరుల కోసం హిట్లరు నాజీ సైన్యానికి సహాయపడక తప్పదు. రాకెట్ల ద్వారా బాంబులను లండనుపై కురిపించవచ్చనే ఉద్దేశంతోనే హిట్లరు రాకెట్ల అభివృద్ధిపై మక్కువ చూపిస్తాడు. కానీ యుద్ధంలో పరిస్థితి తలక్రిందులై హిట్లరు ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాన్ బ్రౌన్ అమెరికా వెళ్ళి తన కలను నిజం చేసుకుంటాడు.

యుద్ధ పరిస్థితులను, concentration campల్లోని ఖైదీలను బానిసలుగా వాడుకుంటూ రాకెట్లని తయారుచేసే భూగర్భ కర్మాగారాలను, వాటిలో ఖైదీల నిస్సహాయ పరిస్థితులను, గంపగుత్తగా వారిని నిర్మూలించే అధికారుల హేయ కృత్యాలను కూడ రచయిత్రి ఈ పుస్తకంలో చిత్రీకరిస్తారు. అప్పటి ప్రపంచ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చిత్రీకరిస్తారు. జర్మనీ రాకెట్ విఙ్ఞానంలో తమకన్నా దశాబ్దాలు ముందుందన్న విషయం తెలిసి యుద్ధానంతరం జర్మని ఇంజనియర్లను తమ దేశానికి ఆహ్వానించి, వారితో తమ పనికాగానే వారిని నిర్లక్ష్యం చేసిన రష్యా, తమని నమ్మి తమ దేశానికి వచ్చిన జర్మన్ ఇంజనియర్లకు తగిన అవకాశాలను కల్పించకుండా సంవత్సరాలు అలక్ష్యం చేసిన అమెరికా వైఖరులను, వాటి వెనుకనున్న రాజకీయ కారణాలను రచయిత్రి వివరిస్తారు. తద్వారా ఈ పుస్తకం కేవలం ఒక చరిత్ర గ్రంథంలా కాకుండా ఒక నవలలా చదివిస్తుంది.

చంద్రుణ్ణి చేరుకోవటానికి బ్రౌనుకు సమ ఉజ్జీగా, అంతరిక్షానికి మనిషిని పంపేవరకు పందెంలో ముందున్న రష్యా రాకెట్ ఇంజనీయరుగా సెర్గి పావ్లొవిచ్ కొరొలెవ్ మనకు పరిచయం అవుతాడు. ఒకపక్క బ్రౌన్ ప్రపంచమంతటికీ కనిపిస్తూ, అందరికీ తెలిసిన వ్యక్తిగా మసులుతుంటే, కొరొలెవ్ పేరు మాత్రం ఎక్కడా బయటకు రాకుండా అప్పటి రష్యా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. బ్రౌన్ లాగానే రాకెట్లను కేవలం తమ సైనిక అవసరాలకు వాడుకోజూసే ప్రభుత్వాలకు సేవ చేస్తూనే తన కలను నిజం చేసుకునేందుకు కొరొలెవ్ చేసిన పోరాటం అచ్చెరువు కలిగిస్తుంది. ఈయన తన జీవిత తొలిదశలో దేశద్రోహిగా నేరం ఆరోపించబడి సంవత్సరాలపాటు ఖైదీగా బంధించబడి, కఠిన శారీరిక శ్రమ చేయవలసి వస్తుంది. జైలునుండి కేవలం రాకెట్లను నిర్మించటానికి బయటకు తీసుకురాబడతాడు. అప్పటికే కుటుంబం చిన్నాభిన్నం అయిపోయుంటుంది. అయినా తన కృషిని కొనసాగిస్తాడు. మానవ జీవనానికి ఏ మాత్రం సహకారి కాని ఎడారి ప్రాంతంలో రాకెట్లను నిర్మిస్తూ రేసులో రష్యాకు తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించి పెడతాడు. కొరొలెవ్ జీవితం చాలా స్ఫూర్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా యురి గగారిన్ ను అంతరిక్షంలో మొదటి మనిషిగా పంపే ఘట్టం మాత్రం చాలా ఆసక్తి కలిగిస్తుంది.

మీకు ఆసక్తి ఉంటే తప్పక చదవవలసిన పుస్తకం. ఈ పుస్తకంలోని కొన్ని పుటలను ఇక్కడ చూడవచ్చు.

2 comments:

  1. ఈ పుస్తకాన్ని నేను కూడా చదివాను, చాలా రోజులు అలా అలోచిస్తూనే వుండిపోయాను. నిజానికి నాకెందుకో 1970 ల లో రష్యా వెనుకబడడం అసాధారణంగా అనిపించింది.

    ReplyDelete
  2. భాస్కర రామి రెడ్డి గారికి,
    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. రష్యా కేవలం అమెరికా కన్నా ముందున్నామని చెప్పుకోవడానికి మాత్రమే తన అంతరిక్ష పరిశోధనల్ని వాడుకుంది కానీ చిత్తశుద్ధితో ప్రయత్నించుంటే చంద్రుని మీద మొదటి మానవుణ్ణి పంపగలిగి ఉండేది. వారి లక్ష్యం రాకెట్లను క్షిపణుల్ల్లాగ వాడుకోవటం కోసమని పుస్తకంలో నాకర్థం అయిన విషయం.
    మీ వ్యాఖ్యకు పనుల ఒత్తిడివల్ల ఆలస్యంగా జవాబిచ్చినందుకు క్షమించగలరు.

    ReplyDelete

మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియపరచండి.