జాతరలో అడుగుపెట్టగానే మనకు దర్శనమిచ్చేవి మంచుతో నిర్మించిన కళాఖండాలు.
ఇలాంటి మంచు శిల్పాలకు కొదువే లేదు. ఇవే కాకుండా పిల్లలు ఆడుకోవటానికి అనేక రకమైన ఆటల శిబిరాలు ఏర్పాటు చేసారు. వీటిలో వీడియో గేములు ఆడే శిబిరం చాలా రద్దీగా ఉండటం భవిష్యత్తులో ఇలాంటి జాతరలు కనుమరుగయ్యే ప్రమాదానికి సూచిక. ఇంట్లో ఒంటరిగా ఇవే ఆటలు ఆడే పిల్లలు బయట నలుగురిలో వచ్చినప్పుడు కూడా అవే ఆటలు ఆడటానికి మక్కువ చూపటం, దానికి పెద్దవాళ్ళు అవకాశం కల్పించటం నిరాశ కలిగించింది. ఇక ఆరుబయటి ప్రదేశాలలో ఆడే మంచు ఆటలకు ఇక్కడ లోటేమీ లేదు. చిన్న పిల్లల జారుడు బండను ఒక కోటలాగ కట్టారు.
కుక్కలు లాగే స్లెడ్జి బండి. మంచు మీద వెళ్ళటానికి అనువైన వాహనం.
మంచు మీద వెళ్ళే జీపులాంటి వాహనం. ఇవేకాకుండా మంచు మీద వెళ్ళే మొబైకులు కూడా ఉన్నాయి. ఈ బైకుల మీద జాతరలో చక్కర్లు కొట్టవచ్చు కూడా.
మంచు మీద రాఫ్టింగ్ ఆట. మేము కూడా ఆడాము. ఇవే కాకుండా ఇంకా కొన్ని మంచు రైడ్లు కూడా ఉన్నాయి. వాతావరణం -8 డిగ్రీలతో, ఈదరు గాలులకు ముఖమంతా ఎర్రగా అయిపోతున్నా, మంచు మీద జారి పడుతున్నా పట్టించుకోకుండా సంబరాల్లో పాలు పంచుకుంటున్న జనాలను చూస్తే ఇక్కడ శీతాకాలాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారనిపించింది.
మంచు మీద వెళ్ళే గుర్రబ్బండి. ఈ బండి మీద కూడా షికార్లు చేయవచ్చు.
సాయంత్రం చీకటి పడుతుండగా తిరిగి మా ఊరికి బయలుదేరాము. ఇంతకీ మా టూరు ఎలా ఉందంటారు?