ఈ మధ్య సాఫ్ట్వేర్ ఉద్యోగుల మీద వస్తున్న వెటకారాలు, వార్తలకు నా ప్రతిస్పందన ఇది. సాటివారు బాధల్లో ఉన్నారని కూడా చూడకుండా ఈ మధ్య వార్తా పత్రికల్లో వస్తున్న వెటకారపు ఆర్టికల్స్, దానికి కొన్ని బ్లాగుల్లో కొనసాగింపు చేస్తున్న విధానం చూస్తే బాధ కలుగుతుంది. సాటివారు తమ జీవన భృతి గురించి ఆందోళన పడుతుంటే వీరికందులో ఎడతెగని హాస్యం కనపడుతోంది.
ఇక సత్యం ఉదంతం బయటపడ్డప్పటినుంచీ మన పత్రికలు సత్యం మూసివేయటం ఖాయమని, ఉద్యోగులు చేత చిప్ప తప్పదని ఊదరగొట్టేస్తున్నాయి. సత్యం రాజు మోసం చేసినట్లు చెప్పబడుతున్న 7000 కోట్లు ఆయనొక్కడే సంపాదించింది కాదు. అది ఆ సంస్థలోని ఉద్యోగుల సంపాదన కూడా. అంత సంపద సృష్టించగలిగినవారు తమ భార్యా పిల్లలను పోషించుకోలేరా? అయినా సత్యం సంస్థ పోగొట్టుకున్నది సంపాదించిన డబ్బునే కానీ, సంపాదించే చేతులను కాదు. ఇప్పటీకీ ఆ సంస్థ ఉనికిలోనే ఉన్నది. ఆ ఉద్యోగులు ఇంకా సంపదను సృష్టిస్తూనే ఉన్నారు. అయినా కూడా వార్తా పత్రికలు ఇక ఉద్యోగుల పని అయిపోయిందనే అంటున్నాయి. సాధారణంగా ఇంట్లో దొంగలుపడి మొత్తం దోచుకుపోతే ఇంటివారు మరోసారి అలా జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటారేగానీ ఆ ఇంటిని కూలగొట్టేసి, రోడ్డున పడి అడుక్కుతినరు. వీరి బాధ అలా ఇంకా జరగలేదనా? ఆ సంస్థ ఉద్యోగుల, మదుపుదారుల మానసిక స్థైర్యాన్ని, శాంతిని పెంపొందించే విధంగా నాలుగు మాటలు చెప్పటం మంచిదికాదా?
ఆర్థిక మాంద్యంవల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడినా కేవలం సాఫ్ట్వేర్ రంగం మాత్రమే మునిగిపోయినట్లు వార్తాపత్రికలు కోలాహలం సృష్టిస్తున్నాయి. ఇవి కొందరికి శునకానందం కలిగిస్తోందనుకుంటాను. సాఫ్ట్వేర్ ఇంజనీరంటే కేవలం 3 నెలల కోర్సు చేసి వేల జీతం వచ్చే ఉద్యోగాన్ని అప్పనంగా కొట్టేస్తారనుకుంటారు. ఉద్యోగం తేలిగ్గానే దొరికినా దాన్ని నిలబెట్టుకోవటానికి అహర్నిశలు పాటు పడాల్సి ఉంటుంది. అనునిత్యం కొత్త కొత్త కోర్సులు చేయాలి. లేకపోతే 6 నెలల్లో నేర్చుకున్నది పనికి రాకుండా పోతుంది. ఇక జీతం సంగతి వస్తే, తీసుకున్నదానికంటే ఎక్కువే కష్టపడాల్సి ఉంటుంది. సహనం, ఏకాగ్రత కోల్పోకుండా గంటల తరబడి పని చేయాల్సి ఉంటుంది. ఇలా తమని తాము మలుచుకోలేనివారు ఈ రంగంలో చాలా త్వరగా తమ ఉద్యోగాలు కోల్పోతారు. ఈ రంగంలో ఉద్యోగాలు ఊడటం ఎంత సులభమో కొత్త ఉద్యోగాలు పుట్టుకురావటం కూడా అంతే సులభం. ఉన్న ఉద్యోగం ఎన్నాళ్ళుంటుందో తెలియని పరిస్థితి ఈ రంగంలో మామూలే కాబట్టి ఉద్యోగులు కూడా సహజంగానే ఇలాంటి విపత్కర పరిస్థితులకు సిద్ధపడే ఉంటారు. కాబట్టి వారు తమ పరిస్థిని చక్కదిద్దుకునేదాక మన అనవసర భయాలను వారి మీద, వారి కుటుంబసభ్యుల మీద రుద్దకుండా ఉంటే అదే వారికి మనం చేయగలిగే పెద్ద ఉపకారం.
వీలైనంత త్వరగా కష్టకాలం గడిచి అందరికీ మంచి రోజులు రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
(నేను సాఫ్ట్వేర్ ఉద్యోగి కాదు. కానీ నా స్నేహితుల్లో చాలా మంది ఈ రంగంలో పనిచేస్తున్నారు. వారిని చూసిన తర్వాత ఇలా వ్రాయాలనిపించింది.)
" శునకానందం" హ హ
ReplyDeleteఒకప్పుడు సాఫ్ట్ వేర్ యువత భువినుండి దివికేగినవారిలా ప్రవర్తించారనడంలో అణుమాత్రం సందేహం లేదు. పాతికేళ్ళ కుర్రాడు పాతికనుండి యాభై వేలు సంపాదిస్తుంటే చుట్టూ ఉన్న కనీసం నాలుగు నాన్-సాఫ్ట్ వేర్ కుటుంబాలు కుళ్ళుకోకుండా ఉంటారా? అప్పుడు వారి వంతు, ఇప్పుడు వీరి వంతు.
చాలా వరకు నిజమే చెప్పారు
ReplyDeleteu r 100000000% right...
ReplyDeletevery good post.
ReplyDeleteI too feel the same.
కన్ను మిన్ను కానక గవర్నమెంట్ జాబ్ ఉన్న వారిని తక్కువ జీతం అని హేళన చేసిన వారి గురినిచి నాకు తెలుసు . చేసుకున్న వాడికి చేసుకన్నంత మహదేవ .
ReplyDelete@జీడిపప్పుగారికి, @ప్రదీప్ గారికి, @భవాని గారికి, @Anonymousగా వ్యాఖ్యలు వ్రాసినవారికి, మీ అభిప్రాయాన్ని వ్యాఖ్య ద్వారా తెలిపినందుకు నా ధన్యవాదాలు.
ReplyDelete