Sunday, April 26, 2009

Space Race పుస్తక పరిచయం

Space Race పుస్తకాన్ని మీకు పరిచయం చేయటం కోసమే ఈ టపా. అంతరిక్షయాణాన్ని, తద్వారా చంద్రుణ్ణి తాకాలని కలలు కనే ఇద్దరు రాకెట్ ఇంజనియర్ల జీవిత చిత్రణే ఈ పుస్తకం.

ఒకరు జర్మన్ ఇంజనియరైన వెర్నెర్ వాన్ బ్రౌన్. ఈయన రెండవ ప్రపంచ యుద్ధకాలంలో హిట్లరు కోసం రాకెట్లను తయారుచేసేవాడు. గొప్ప గొప్ప రాకెట్లను తయారు చేసి తద్వారా అంతరిక్షాణ్ణి, తర్వాత చంద్రుణ్ణి, తదనంతరం సుదూర గ్రహాలకు ప్రయాణించాలనేది ఈయన కల. ఆ కలను సాకారం చేసుకోవాలంటే తగిన వనరుల కోసం హిట్లరు నాజీ సైన్యానికి సహాయపడక తప్పదు. రాకెట్ల ద్వారా బాంబులను లండనుపై కురిపించవచ్చనే ఉద్దేశంతోనే హిట్లరు రాకెట్ల అభివృద్ధిపై మక్కువ చూపిస్తాడు. కానీ యుద్ధంలో పరిస్థితి తలక్రిందులై హిట్లరు ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాన్ బ్రౌన్ అమెరికా వెళ్ళి తన కలను నిజం చేసుకుంటాడు.

యుద్ధ పరిస్థితులను, concentration campల్లోని ఖైదీలను బానిసలుగా వాడుకుంటూ రాకెట్లని తయారుచేసే భూగర్భ కర్మాగారాలను, వాటిలో ఖైదీల నిస్సహాయ పరిస్థితులను, గంపగుత్తగా వారిని నిర్మూలించే అధికారుల హేయ కృత్యాలను కూడ రచయిత్రి ఈ పుస్తకంలో చిత్రీకరిస్తారు. అప్పటి ప్రపంచ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చిత్రీకరిస్తారు. జర్మనీ రాకెట్ విఙ్ఞానంలో తమకన్నా దశాబ్దాలు ముందుందన్న విషయం తెలిసి యుద్ధానంతరం జర్మని ఇంజనియర్లను తమ దేశానికి ఆహ్వానించి, వారితో తమ పనికాగానే వారిని నిర్లక్ష్యం చేసిన రష్యా, తమని నమ్మి తమ దేశానికి వచ్చిన జర్మన్ ఇంజనియర్లకు తగిన అవకాశాలను కల్పించకుండా సంవత్సరాలు అలక్ష్యం చేసిన అమెరికా వైఖరులను, వాటి వెనుకనున్న రాజకీయ కారణాలను రచయిత్రి వివరిస్తారు. తద్వారా ఈ పుస్తకం కేవలం ఒక చరిత్ర గ్రంథంలా కాకుండా ఒక నవలలా చదివిస్తుంది.

చంద్రుణ్ణి చేరుకోవటానికి బ్రౌనుకు సమ ఉజ్జీగా, అంతరిక్షానికి మనిషిని పంపేవరకు పందెంలో ముందున్న రష్యా రాకెట్ ఇంజనీయరుగా సెర్గి పావ్లొవిచ్ కొరొలెవ్ మనకు పరిచయం అవుతాడు. ఒకపక్క బ్రౌన్ ప్రపంచమంతటికీ కనిపిస్తూ, అందరికీ తెలిసిన వ్యక్తిగా మసులుతుంటే, కొరొలెవ్ పేరు మాత్రం ఎక్కడా బయటకు రాకుండా అప్పటి రష్యా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. బ్రౌన్ లాగానే రాకెట్లను కేవలం తమ సైనిక అవసరాలకు వాడుకోజూసే ప్రభుత్వాలకు సేవ చేస్తూనే తన కలను నిజం చేసుకునేందుకు కొరొలెవ్ చేసిన పోరాటం అచ్చెరువు కలిగిస్తుంది. ఈయన తన జీవిత తొలిదశలో దేశద్రోహిగా నేరం ఆరోపించబడి సంవత్సరాలపాటు ఖైదీగా బంధించబడి, కఠిన శారీరిక శ్రమ చేయవలసి వస్తుంది. జైలునుండి కేవలం రాకెట్లను నిర్మించటానికి బయటకు తీసుకురాబడతాడు. అప్పటికే కుటుంబం చిన్నాభిన్నం అయిపోయుంటుంది. అయినా తన కృషిని కొనసాగిస్తాడు. మానవ జీవనానికి ఏ మాత్రం సహకారి కాని ఎడారి ప్రాంతంలో రాకెట్లను నిర్మిస్తూ రేసులో రష్యాకు తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించి పెడతాడు. కొరొలెవ్ జీవితం చాలా స్ఫూర్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా యురి గగారిన్ ను అంతరిక్షంలో మొదటి మనిషిగా పంపే ఘట్టం మాత్రం చాలా ఆసక్తి కలిగిస్తుంది.

మీకు ఆసక్తి ఉంటే తప్పక చదవవలసిన పుస్తకం. ఈ పుస్తకంలోని కొన్ని పుటలను ఇక్కడ చూడవచ్చు.

Sunday, April 5, 2009

ఎన్నికలొచ్చాయి

ఎన్నికల జాతర మళ్ళీ మొదలయ్యింది. పగటి వేషగాళ్ళు, గారడీగాళ్ళు, మాటల పోటుగాళ్ళు జాతరను రక్తి కట్టిస్తున్నారు. హామీలు, వాగ్దానాలతో ఓటరు దేవుణ్ణి స్తుతించి మద్యం, డబ్బులతో అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి తగిన నాయకుణ్ణి ఎన్నుకోవటమనే ప్రక్రియ జోరందుకుంటున్నది. ఈ టపాలో కేవలం నా అభిప్రాయాలను మాత్రం పంచుకుంటున్నాను.

నాయకుడనే వాడు తన జాతికి దిశా నిర్దేశం చేస్తూ, శతాబ్దాల పాటు దేశానికి మంచి జరిగేలా ప్రణాళికలను రచించి అమలుపర్చేవాడై ఉండాలనేది నా అభిప్రాయం. ఇప్పటి రాజకీయులలో అలాంటి నాయకులు ఉన్నారనే నమ్మకం నాకు లేదు. యువతరం నాయకులు కూడా దొందు దొందేననిపిస్తున్నారు. ప్రజలను మభ్య పెట్టడంలో పెద్దవారికన్నా రెండాకులు ఎక్కువే చదివారు. వీరందరి తీరు చూస్తుంటే కేవలం ఈ ఎన్నికలు గట్టేక్కితే చాలాన్నట్లున్నది. ఎంతసేపూ అది ఉచితం, ఇది ఉచితం , ఊరకే డబ్బులిస్తామనేవారేగానీ దేశాన్నిగానీ, రాష్ట్రాన్నిగానీ ఎలా అభివృద్ధి పథంలో నడిపిస్తారో ఎవరూ చెప్పటం లేదు. వీరు ఉచితంగా ఇచ్చే వరాల మీద ఆధారపడి లేని నా ఓటును వారికే ఎందుకివ్వాలో ఏ నాయకుడూ చెప్పటం లేదు. సామాజిక న్యాయం, పేద ప్రజలను ఉద్దరిస్తామనే వాదనకు నా వద్ద విలువ లేదు. ఎవరికివారు తమ స్థితి మెరుగుకావటానికి కష్టపడి ప్రయత్నించాలి. దానికి సమాజంలో అందరికీ సమాన అవకాశం ఉండేలా పరిపాలన ఉండాలి. అంతేగానీ అన్నీ పళ్ళెంలో పెట్టి అందిస్తామని పార్టీలు చెప్పటం తగదు. పోనీ ఆ వాగ్దానాలను ఎలా నెరవేరుస్తారో, అందుకు వనరులు ఎక్కడ ఉన్నాయో ఎవరూ చూపటం లేదు, చెప్పటం లేదు. ఇలాంటి నాయకమన్యులే తప్ప నిజమైన నాయకులెవరూ ఇప్పటివరకూ రంగంలో రాకపోవటం చాలా నిరాశ కలిగిస్తున్నది.

బరిలో ఉన్న అభ్యర్థులందరినీ నిరాకరించే వీలున్నప్పుడే ఓటు వేయాలనే అభిప్రాయాన్ని మార్చుకుని ఈ సారి ఓటు వేయడానికి నిర్ణయించుకున్నాను. అందుకు కారణం ఇక్కడ ప్రజాతంత్రం ఎలా పనిచేస్తుందో, అందులో ప్రజల పాత్రేమిటో చూసాను. భారతదేశంలో ఉన్నది అచ్చమైన ప్రజాస్వామ్యనే భ్రమ తొలిగిపోయింది. ప్రజాస్వామ్యమనేది ఒక పరిణితి చెందిన సమాజం అనుసరించే పరిపాలనా విధానం. అలా పరిణితి సంతరించుకోని దేశాలు ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వపు పోకడలతోనో, రాచరికపు హంగులతోనో, మంద బలంతోనో అనుసరిస్తాయి. మన దేశంలో నడుస్తున్నది అలాంటి పరిపాలన వ్యవస్థే. ఇందులో ప్రజల పాత్ర కేవలం ఓటు వేయటం వరకే పరిమితం. తర్వాత పరిపాలనా వ్యవహారాలలో ప్రజలది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే. కనీసం ఆ పరిమిత పాత్రనైనా పోషించటానికి ఈ సారి ఓటు వేద్దామని నిర్ణయించుకున్నా.

ఇక నా ఓటు ఎవరికి అన్న విషయంలో 35% ఆ పార్టీ సిద్ధాంతాలు, ప్రణాళికలు పాత్ర వహిస్తే, 50% అభ్యర్థి గత చరిత్ర, ఇంతకు ముందు అతని పనితనం ప్రభావం చూపిస్తాయి. ఒకవేళ అభ్యర్థి కొత్తవాడైయుంటే అతను తన నియోజకవర్గానికి ఎలాంటి సేవ చేయబోతున్నాడో, దానికి ఎలాంటి పద్ధతులు అవలంబిస్తాడన్న విషయంపై ఆధార పడుతుంది. ఇక మిగిలిన 15% అతని వ్యకిగత జీవితం, అతని విద్యార్హతలు, అతని మాట, పని తీరుపై ఆధార పడతాయి. ఇంకా ఏమైనా విషయాలు మర్చిపోయుంటే గుర్తు చేయండి. అలా నా ఓటు తీసుకునే అభ్యర్థి కనీసం పాసు మార్కులు (35%) పొందినవాడై ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ శెలవు తీసుకుంటున్నాను.