Sunday, May 18, 2008

జైపూరుపై ఉగ్రవాద దాడి

గత మంగళవారం జైపూరులో ఉగ్రవాదులు పేల్చిన వరుస బాంబులవల్ల 75 మందికిపైగా చనిపోయారు. మామూలుగానే మన నాయకులు ఆ దాడిని ఖండించేసి చేతులు దులుపుకున్నారు. దాడి జరిగిన ప్రదేశంలోని దేవాలయంలో కూడా మరుసటి రోజున పూజలు యధావిధిగా జరిగాయి. ఇక ఇదే నగరంలో ఈ రోజు క్రికెట్ మ్యాచు జరుగుతోంది. దాడి జరిగిన ఆనవాలు మరో మంగళవారానికి మచ్చుకైనా కానరావు. మరో దాడి జరిగేవరకు హాయిగా నిదురపోవచ్చు.

దాడి చేసినది ఒక పొరుగుదేశపు ఉగ్రవాద సంస్థ అయితే దానికి తోడ్పడింది మరో పొరుగుదేశపు గూఢాచారి సంస్థ అని అనుమానం. మన పొరుగుదేశాలు తమ భూభాగంపై అనేక ఉగ్రవాద సంస్థలు శిక్షణా శిబిరాలు నడుపుతుంటే వాటిని అరికట్టకుండా వాటికి పరోక్ష మద్దతిస్తున్నాయి. ఏ దేశమైనా తన ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి పొరుగుదేశాలతో శాంతిని కోరదు. దేశంలో జరిగిన, జరుగుతున్న దాడులకు పొరుగుదేశపు ఉగ్రవాద సంస్థలే కారణమని తెలిసినా సదరు పొరుగుదేశంతో శాంతి, వ్యాపార చర్చలకు సిద్ధమయ్యే ప్రభుత్వాలకు ఇదెప్పుడు అర్థమవుతుందో? మూర్ఖ మిత్రుడు వివేకవంతుడైన శత్రువు కన్నా ఎక్కువ చెరుపు చేస్తాడు. కాబట్టి, ఇకనైనా ఆ మూర్ఖ మిత్రత్వం కోసం ప్రయత్నం మానుకుని, ప్రజల ప్రాణ రక్షణపై దృష్టి పెట్టవలసిందిగా ప్రభుత్వానికి నా మనవి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియపరచండి.