మనకు తెలిసి మన బంధువులో, స్నేహితులో, ఇరుగు పొరుగులో చాలామంది Amway సంస్థ సభ్యులై ఉండవచ్చు. దీంట్లో చేరే చాలామంది తాము ఈ వ్యాపారం ద్వారా కోట్లు, లేదా లక్షలు సంపాదిస్తామని గాఢంగా విశ్వసిస్తుంటారు. కాని ఇదే వ్యాపారంలో సంవత్సరాల తరబడి కష్టపడి, ఉన్నత అంచెలను చేరిన ఒకాయన తన చేదు అనుభవాలను ఒక పుస్తక రూపంలో ప్రచురించారు. దాన్ని మీకు పరిచయం చేయటమే ఈ టపా ఉద్దేశం.
Merchants of Deception అనే ఈ పుస్తకాన్ని ఆమ్వే పేరిట జరుగుతున్న వ్యాపారాన్ని దాదాపు 10 సంవత్సరాల పాటు నిర్వహించి, అందులో ఉన్నత అంచెలను చేరి, అందులోని మోసాలను పరిశీలించిన Eric Scheibeler అనే ఆయన వ్రాసారు.
Eric ఉద్దేశం ప్రకారం ఈ వ్యాపారంలో నికరంగా సంపాదించేదేమీ ఉండదు. కేవలం ఎండమావులను తరుముతూ, అలసిపోతూ చివరకు ఉన్నదంతా పోగొట్టుకోవటం ఈ వ్యాపారంలో చాలా సాధారణం. కాని ఈ నిజాన్ని తెలుసుకోనీయకుండా చాలా పకడ్బందిగా వీరి శిక్షణ ఉంటుందని ఈ పుస్తకంలో వివరిస్తారు. ఈ వ్యాపారంలో చాలా మంది లక్షలకు లక్షలు సంపాదించినట్లు ప్రచారం చేస్తారు. కాని, నిజంగా ఆ లక్షాధికారుల సంపాదనలో కేవలం Amway వ్యాపారం ద్వారా సంపాదించింది 5 శాతం దాటదని ఎరిక్ చెప్తారు.
ఈ పుస్తకాన్ని ఆయన pdf రూపంలో ఉంచారు. http://www.merchantsofdeception.com/ పుస్తకం చదవదలచినవారు ఇక్కడ మీ email ID ఇస్తే మీకు పుస్తకం download చేసుకోవటానికి ఒక link పంపబడుతుంది.
మనకు తెలిసినవాళ్ళల్లో చాలా మంది ఈ Amway సభ్యులుగా ఉండవచ్చు. మనం వారిని వస్తువులు అంటగట్టే అమ్మకందార్లుగా భావించి ఆట పట్టించటమో, తప్పుకు తిరగటమో చేస్తుంటాము. అలాంటి వారు మీకు తారసపడితే వారికి ఈ పుస్తకం గురించి చెప్పండి. నిజంగానే ఈ వ్యాపారంలో ఉన్నవారందరూ లక్షలు సంపాదిస్తుంటే సంతోషమే. అలాకాక నష్టపోతూ కూడా ఆ నిజాన్ని తెలుసుకోలేక ఇంకా ఇందులో పెట్టుబడి పెడుతుండేవారి కోసమే ఈ పుస్తకం. మనకు తెలిసినవారెవరైనా ఈ సంస్థ సభ్యులుగా ఉంటే, వారికి ఈ పుస్తకం గురించి చెబుదాము. నిజానిజాలను వారే తెలుసుకుంటారు. ఏమంటారు?