Monday, March 24, 2008

ఉద్యోగ ధర్మం

మొన్న నా మెడికల్ ఇన్సురెన్స్ కార్డ్ చేయించుకుందామని మాంట్రియాల్ వెళ్ళాను. అక్కడ చేరుకునేసరికి మధ్యాహ్నం 2.00 అయింది. సాయంత్రం 4.30కు ఆఫీసు మూసివేసే సమయం. అక్కడ నాలాగ వచ్చినవారితో పెద్ద క్యూ ఏర్పడింది. అంత దూరం వచ్చి వెనుదిరిగి పోవటం ఎందుకని మేమూ ఆ తోక చివర నిల్చున్నాము. లోపల వెళ్ళి మా వంతు వచ్చేసరికి మరో గంట గడిచింది. మేము వెళ్ళి మా పనిని విన్నవించుకున్నాము. అక్కడి ఉద్యోగిని మా పత్రాలను పరిశీలించి తృప్తిపొందిన తర్వాత మాకు ఇన్సురెన్స్ కార్డ్ వస్తుందని కానీ దానికోసం 3 నెలలు ఆగవలసి ఉంటుందని చెప్పి, మేము ప్రస్తుతం మా వైద్యసంబంధ సేవలను ఎలా పొందుతున్నామో తెలుసుకుని, మా కార్డు వచ్చేవరకు ఇక్కడి రాష్ట్రంలో ఏయే సేవలను ఉచితంగా పొందవచ్చో తెలిపింది. మేము ఒక్క ఫారం కూడా నింపలేదు. అమే మా వివరాలను నమోదు చేసుకుని ఫారం ప్రింటు చేసిస్తే సంతకాలు మాత్రం పెట్టాము. ప్రధాన కార్యాలయానికి మా పత్రాలు scan చేసి పంపించేసింది. మా పని పూర్తి కావటానికి పట్టింది కేవలం 20 నిమిషాలే. ఇది ఇక్కడి ప్రభుత్వ కార్యాలయాల పనితీరు. మరి మన దేశపు ప్రభుత్వ కార్యాలయాల పనితీరును ఇక్కడితో పోల్చగలమా? లంచం ఇవ్వకుండా మా ఆవిడ passport కోసం మా పెళ్ళి ధృవపత్రం సంపాదించటానికి బెంగళూరులో వేరే వేరే మూలల్లో ఉన్న 3 కార్యాలయాలకు దాదాపు నెలన్నర పాటు తిరిగగాను. అఫీసులో 5 రూపాయలకు దొరికే అప్లికేషన్ ఫారం "స్టాకు" లేదు కానీ అదే ఆఫీసు బయట మెట్ల ధగ్గర 35 రూపాయలకు దొరుకుతుంది. 100 రూపాయలిస్తే ఒక బ్రోకరు పని చేసిపెడతాడు. కాదూకూడదంటే అడ్డమైన ఫారాలు నింపి, ఎవెరెవరివో సంతకాలు తీసుకుని రావాలి. ఇంజనియరింగు చదివినా ఒక చిన్న ఫారం కూడా నింపలేవా అన్నట్లు ఆ ఉద్యోగి ఓ పదిసార్లు తప్పులు పడతాడు. ప్రతి తప్పుకూ పరమపద సోపానంలో ఆదిశేషుడు మింగిన కాయలా మనం క్యూ చివరకు చేరుతాము. ఇలా 2 సార్లు జరిగేసరికి సదరు ఉద్యోగి పని చేసిన అలుపు తీర్చుకోవటానికి వెళతాడు. మళ్ళీ ఆఫీసు మూసేముందు కనిపిస్తాడు. ఇలా 3 శనివారాలు జరిగిన తర్వాత, ఫారంలో ఏ చిన్న తప్పులూ లేవని నిర్ధరించుకుని వెళ్తే, చివరకు ఒక ఫారం కాగితం వెనుకవైపు తిప్పి, ఆ ఖాళీ ప్రదేశంలో సంతకం చేయలేదని అప్లికేషన్ తీసుకోకుండా నిరాకరించిన ఉద్యోగిని చూస్తే ఎంత అసహ్యం కలిగిందో మాటల్లో చెప్పలేను. చివరకు ధృవపత్రం చేతికి వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయి మా ఆవిడ వెంటలేకుండానే నేను కెనడా వచ్చాను. దీనివల్ల ఎంత డబ్బు, సమయం వృధా అయిందో ఆ ఉద్యోగికి పట్టదు. ఒకవేళ ఫిర్యాదిచ్చినా అది త్వరగా తెమిలే వ్యవహారం కాదు. అయినా ఒక ఉద్యోగి తన విధులను నిర్వర్తించేలా చేయటానికి కూడా ఫిర్యాదు చేయవలసి రావటం మేము చేసుకున్న దురదృష్టం.

మన ప్రభుత్వ కార్యాలయాలలో కూడా ఇలాగే పనులు జరిగే రోజులు వస్తాయా?

Sunday, March 16, 2008

Yahoo messenger, Google talkలో తెలుగు వ్రాయటం ఎలా?

Yahoo messenger, Google talkలలో తెలుగులో వ్రాయాలని నాకు చాలా రోజులనుండి కోరిక. ఈ రోజు ఒక దారి కనిపించింది. దీనికన్నా సులభ పద్ధతి ఉంటే దయచేసి నాకు తెలుపగలరు.

ముందుగా నేను వ్రాయాలనుకున్నదాన్ని కింద చూపిన సైట్లో తెలుగు లిపిలో వచ్చేలా వ్రాసి, దాన్ని messenger లేదా talkలో అతికించి (paste) చేసి పంపితే అది తెలుగులోనే పంపినవారికి చేరుతోంది.

http://www.google.com/transliterate/indic/Telugu

బరహIME ఉన్నవారు ఏ notepadలోనో తెలుగులో వ్రాసి దాన్ని messengerలో అతికించేసి పంపుకోవచ్చు. ప్రస్తుతం ఇది చికాకు పద్ధతే అయినా తెలుగులో మరెలా వ్రాయాలో తెలియకపోవటంవల్ల ఇదే వాడుతున్నాను. విఙ్ఞులు సులభ పద్దతి చూపించవసిందిగా మనవి.

Saturday, March 8, 2008

మళ్ళీ మంచు కురిసింది.

నిన్న రాత్రి కూడా మంచు కురిసింది. ఈ వారానికి ఇది రెండవ మంచు తుఫాను. ఇప్పుడంటే అలవాటు పడిపోయాను కానీ కొత్తగా వచ్చినప్పుడు చలికాలంలో బయటకు వెళ్ళాలంటే T.Vలో వాతావరణ సూచనలు తెలుసుకునిగానీ వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు మంచులోనే వెళ్ళటం, జారిపడటం మామూలైంది. కొత్తల్లో ఎక్కడైనా జారిపడితే మయసభలో దుర్యోధనుడు బాధపడినంతగా బాధ పడిపోయేవాడిని. ఇప్పుడు హాయిగా నవ్వేసి, మంచు దులుపుకుని ముందుకు సాగటమే.

సరేగానీ పొద్దున్నే లేచి ఫోటోలు తీశాను. కొన్ని ఇక్కడ ఉంచుతున్నాను. ఎలా ఉన్నాయో చెప్పండి.

snow1 మా బాల్కని నుండి కనిపించే దృశ్యం.

snow2 మా ఇంటి ముందున్న అడివి.

snow5 మా అపార్ట్ మెంట్. ఒక అంతస్తంత ఎత్తుగా మంచు పేరుకుపోయి ఉంది.

snow8 హాయిగా ముసుగు తన్ని పడుకోనీయకుండా కార్లను శుభ్రపరిచే పని నిజంగా శిక్షే.

snow10

snow11