ప్రతివారికీ ఎప్పుడో ఒకప్పుడు తమ ఊరు ఙ్ఞాపకం వస్తుంది. నాకైతే ఈ ఆదివారం ఈనాడు ముఖచిత్ర కథనం చూసి, వికిపిడియాలో మా ఊరి గురించి వివరాలు చూద్దామని వెతికినప్పుడు మా ఊరు ఙ్ఞాపకం వచ్చింది. వికిపిడియాలో అయితే ఖాళీ కాగితం దర్శనమిచ్చింది. ఇక అక్కడ వివరాలు పొందుపరచవలసి ఉంది.
మా ఊరు అనంతపురం జిల్లా పెన్నా నది తీరాన ఉన్న పామిడి గ్రామం. నా చిన్నతనంలో పెన్నా నది చాలా బాగుండేది. విశాలమైన ఇసుక తిన్నెలు మా ఊరి పిల్లలందరికీ ఆట మైదానాలు. వర్షాకాలంలో మాత్రమే నిండుగా ప్రవహించే నది ఎండాకాలంలో మాత్రం పెనకచెర్ల డ్యాం నుండి వదలిన నీళ్ళతో చిన్న పాయగా ప్రవహించేది. వేసవి కాలం వచ్చిందంటే మాకు ఉదయాలు, సాయంత్రాలు నది ఒడ్డునే కాలక్షేపం. ఉదయం నదికి వెళ్ళి స్నానాలు చేసి భోగేశ్వర స్వామి గుడికెళ్ళి తర్వాత స్కూలుకు వెళ్ళేవాళ్ళం. మళ్ళీ సాయంత్రాలు ఆడుకోవటానికి నది తీరానికే. ఇక వర్షాకాలం వస్తే స్కూలుకు ఎటూ శెలువే కాబట్టి మళ్ళీ నదికే పరుగు. నదిలో ఈత కొట్టడం, పడవలు వదలటం, ఇసుకలో కబడ్డి ఆడటం మాకు ఇష్టమైన కార్యక్రమం. నది మధ్యలో కట్టిన చిన్న రామాలయం, ఆంజనేయ స్వామి గుడి శ్రీరామనవమి రోజున చాల సందడిగా ఉండేది. ఊరంతా సాయంత్రానికి అక్కడ చేరుకుని పండుగను ఉత్సాహంగా జరుపుకునేవారు. సంవత్సరానికి ఒక్కసారి నదికి అవతలి గట్టున ఉన్న రామేశ్వరుని దేవాలయానికి నడుస్తూ వెళ్ళటం కూడా నాకు బాగా గుర్తుంది. చిన్న ఊరు కావటం వల్ల ప్రతి ఒక్కరూ కావలసిన వాళ్ళే, బంధువులే.
మా ఊరికి ముఖ్య ఆకర్షణంటే భోగేశ్వర స్వామి ఆలయం. మా ఊరికి ఆ పేరు రావటానికి కూడా ఆ స్వామే కారణమంటారు. పామిడి నిజరూపం ’పాము ముడి’. లింగాకారంలో ఉన్న స్వామిని ఒక పాము ఎప్పుడూ చుట్టుకుని ఉండేదని, అందువల్ల ఆ ప్రదేశానికి పాము ముడి అని పేరు వచ్చిందని, కాల క్రమంలో అది పామిడి అయ్యిందనంటారు. స్వామి స్వయంభువని ఆ లింగం రోజు రోజుకీ పెరుగుతోందని నమ్మకం. నాకు సరిగ్గా తెలియదు. నేను హైస్కూలుకు రాగానే బెంగళూరుకు మకాం మారింది. తర్వాత నా విద్యాభ్యాసమంతా కర్ణాటకలో జరగటం, ఉద్యోగంలో మునిగి తేలుతూ చాలా సంవత్సరాల పాటు మా ఊరి వైపు వెళ్ళలేకపోయాను.
మొన్న ఇండియా వెళ్ళినప్పుడు ఆఫీసుకు 2 వారాల శెలువు పడేసి ఊర్లోనే ఉన్న చిన్నాన్న దగ్గరికి బయలుదేరాను. అనంతపురం దాటినప్పటి నుంచీ ఎప్పుడెప్పుడు ఊరు చేరుతానా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. కల్లూరు దాటిన వెంటనే పెన్నా నది మీద నుండి బస్సు వెళ్ళేది. బస్సు కిటకీనుండి నదిలో నీళ్ళు ఉన్నాయా లేవా అని చూసి, మరుసటి రోజు నది దండయాత్రకు బయలుదేరటం నా అలవాటు. బస్సు కల్లూరు దాటగానే పెన్నా ఇసుకతిన్నెల కోసం ఎదురుచూస్తున్నాను. ముళ్ళకంప చెట్లు దట్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడొస్తుంది అప్పుడొస్తుందని ఎదురుచూస్తునే ఉన్నా. బస్సు పామిడి చేరుకున్నది. నేను నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. పెన్న కనిపించలేదు. నేనేమైనా పొరబడ్డానా అని సందేహపడ్తూ ఇల్లు చేరుకున్నాను. తర్వాత చిన్నాన్న ద్వారా తెలిసినదేమిటంటే ఇసుకంతా అక్రమంగా తరలిపోయిందని. తరలించటానికి ఇసుక లేకపోయాక భూమి ఆక్రమణలకు గురైయింది. మిగిలిన స్థలమంతా ముళ్ళకంపలతో నిండిపోయి జనం అడుగుపెట్టడానికి అసాధ్యం అయిపోయిందని. ఇక రాముని, ఆంజనేయిని గుళ్ళ గురించి అడిగే ధైర్యం చేయలేకపోయాను. ఇక అక్కడ ఉన్నన్ని రోజులూ చాలా విసుగ్గా గడిచాయి. బంధువుల ఇళ్ళకు వెళ్ళటం బాగానే ఉన్నా నేనెంతో సమయం గడిపే స్నేహితుడు కనిపించకుండా పోయాడు.
నా చిన్ననాటి ఙ్ఞాపకాలు శాశ్వతంగా మనిషి స్వార్థం వల్ల పోగొట్టుకున్నాను. భవిష్యత్తులో మళ్ళీ పెన్న గలగలలు వింటానన్న ఆశ కూడా లేదు. ఇక కేవలం పెన్న నాలాంటివారి ఙ్ఞాపకాల్లోనే ప్రవహిస్తుందా?
వ్రాసింది చదువుతుంటేనే చాల బాధ వేసిందండి. మీకు ఎలా ఉంటుందో ఊహించగలను.
ReplyDeleteఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఈ అక్రమాలు ఆపుదామని ఎవరైనా పోలీసులు, లాయర్ల దగ్గరికి వెళ్ళితే ఏముంది, లంచాలకు అలవాటు పడివుంటారు. ఏమీ చెయలేరు. స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉంటే రౌడీలతో బెదిరించో, రౌడీ పొలిటీషన్లతో ట్రాన్స్ ఫర్లు వగైరా వగైరా... ఉంటాయి..
ఇవన్నీ లేని ప్రపంచం ఎప్పుడువస్తుందో?
మొదటి సగం ఉత్సాహంగా చదివాను చివర చాలా బాధ గా అనిపించింది.చెరువులని నదులని ఆక్రమించటం కూర్చున్న కొమ్మనే నరకడం లాంటిది. నదులు ఆక్రమించి,చెరువుల్లో స్థలాలు చేసి ఇల్లు కట్టుకుని వరదలొచ్చినప్పుడు భోరుమంటారు.
ReplyDeleteముత్యాల,
ReplyDeleteమీరు చెప్పిన విషయం చదివి నాకు చాలా దుఃఖాన్ని కలిగించింది. దీనికి శాశ్వత పరిషాకరం మనం ఆలోచిదాం.
చాలా బాధకలిగించే విషయం.మీ స్నేహితుడికి ఏమయింది.కనిపించకుండా పోవడమంటే?
ReplyDeleteమీ అందరి భావాలు నాతో పంచుకున్నందుకు చాలా నెనెర్లు.
ReplyDelete@రాధిక
నేను పెన్నా నదిని స్నేహితుడిగా భావిస్తూ వ్రాసిన వాక్యమది.
"నేను పెన్నా నదిని స్నేహితుడిగా భావిస్తూ వ్రాసిన వాక్యమది." - నది స్త్రీ లింగం. స్నేహితురాలనాలి.
ReplyDelete@ cbrao గారికి,
ReplyDeleteమీ వ్యాఖ్యకు నెనెర్లు. మీరన్నట్లు ఆ వాక్యంలో తప్పు ఉన్నది. క్షమించగలరు.
ITS A TOUCHING ONE. ప్రస్తుత కాలం లో నదులేమి ఖర్మ.. సముద్రాలు మాయమయినా (ఆక్రమణలతో) ఆశ్చర్య పోవక్కరలేదు. ఈ విషయంలో IAS OFFICERS SRI PRAVEEN PRAKASH, SRI LOV AGARWAAL, SRI RAO లాంటి వారు, వారు పనిచేసిన చోటల్లా ఎంతో శ్రమించారు... ఫలితం? TRASFERS & COURT CASES బహుమానం గా పొందారు. మనకి MILATARY RULE ఒక్కటే సరిగ్గా సరిపోతుంది అని అనిపిస్తోంది ఒకో సారి.
ReplyDelete