కుక్కె సుబ్రహ్మణ్య క్షేత్రం కర్ణాటకలో చాలా ప్రసిద్ధి. ఇక్కడకు దేశం నలు మూలలనుండి భక్తులు వస్తుంటారు. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు జరుగుతాయి. పిల్లలు లేని వారు ఇక్కడకు వచ్చి పూజలు జరిపిస్తుంటారు. మేము ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఇక్కడ జరుపుకున్నాము.
కుక్కె సుబ్రహ్మణ్య క్షేత్రం బెంగళూరు నుండి దాదాపు 300 కి.మి. దూరంలో పశ్చిమ కనుమల్లో ఉంది. ఇది దక్షిణ కన్నడ జిల్లాలో ఉంది. దట్టమైన అడువుల మధ్యలో ఉన్న ఈ చిన్న క్షేత్రానికి బస్సు మరియు రైలు ద్వారా చేరుకోవచ్చు. చాలా మంది బస్సు లేదా సొంత వాహనాల్లో ఇక్కడకు వస్తుంటారు. మొదట ధర్మస్థల వెళ్ళి అక్కడ నుండి కుక్కె వచ్చి త్వరగా బెంగళూరు చేరుతుంటారు. కానీ చాలా మందికి తెలియనిదేమిటంటే కుక్కెకు వచ్చే రైలు మార్గం కనులపండుగగా ఉంటుందని. వీలైతే రైలు ప్రయాణాన్ని వదులుకోవద్దు.
మేము యశవంతపుర నుండి సోమవారం ఉదయం 7:30 బయలుదేరే రైలుకు బయలుదేరాము. వారానికి కేవలం 3 సార్లు మాత్రమే ఈ రైలు ఉంది. మధ్యాహ్నానికి రైలు తుమకూరు మీదుగా హాసన చేరుకుంది. రైలులోనే మధ్యాహ్న భోజనం ముగించాము. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే సకలేశపుర దాటాక ఇంకేం దొరకవు. సకలేశపుర దాటాక జనాలు బోగి వాకిళ్ళ దగ్గర కూర్చోవటం మొదలు పెట్టారు. ఎందుకంటే రైలు ఇక అక్కడి నుండి పశ్చిమ కనుమల్లో ప్రవేశిస్తుంది.
సకలేశపుర తర్వాత వచ్చే దోణిగాల్ స్టేషన్ నుండి యడకుమారి స్టేషన్ వరకు దారి అద్భుతంగా ఉంటుంది. రైలుకు మూడు ఇంజన్లు తగిలిస్త్రారు. రైలు నెమ్మదిగా కనుమల పైభాగానికి చేరుకుంటుంది. ఆ దారిలో వందకు పైగా వంతెనలు, యాభైకు పైగా tunnels ఉన్నాయి. రైలు పర్వత శిఖరాలను చుట్టబెడుతూ వెళ్తుంటే చూడటానికి చాలా బాగుంటుంది. పక్కనే శిఖరాలనుండి జాలువారే పల్చటి జలపాతాలు, లోయల్లో ఉన్న మడుగులు, సెలయేళ్ళు, వందల అడుగుల ఎత్తున్న చెట్లు, వీటన్నిటినీ దాటి మేఘాలను చుంబించే శిఖరాలు చూసి ఆనందించాలి. చాలా మంది దోణిగాల్ నుండి యడకుమారి దాకా రైలు పట్టాల వెంబడి నడుస్తూ (trekking) వెళ్తుంటారని జనాలు చెప్పారు. వర్షాకాలంలో చాలా బాగుంటుందని చెప్పారు. కొన్ని ఫోటోలు మొబైలులో తీసాను. చూడండి.
ఇదే యడకుమారి స్టేషన్.
రైలు యడకుమారి దాటాక కనుమలు దిగటం ప్రారంభిస్తుంది. ఇక కుక్కె చేరాక బయట ఆటోల, జీపుల వాళ్ళు వెంటపడతారు. ఇక్కడ చాలా దుబారి. కాస్త నడిస్తే ధర్మస్థల రోడ్డు చేరుకోవచ్చు. అక్కడి నుండి కుక్కెకు బస్సులు దొరుకుతాయి. మేము కుక్కె చేరుకునేసరికి సాయంత్రం 6:00 అయింది. మధ్యలో కుమారధార నది స్నాన ఘట్టం, పెద్ద వినాయకుని గుడి దర్శించుకున్నాము. మొదటిసారి ఇక్కడకు వస్తుండటం వల్ల బెంగళూరు నుండే హొటల్ బుక్ చేసుకున్నాము. కానీ ఇక్కడ దేవస్థానం వారి సత్రాలు బాగున్నాయి. పెద్దగా రద్ది కూడా లేదు. మరుసటి రోజు పూజ మరియు హోమానికి టికెట్లు కొని, భోజనం చేసుకుని పడుకున్నాము. ఇక్కడ కొంచెం పెద్ద హోటల్లు కేవలం రెండే ఉన్నా భోజనాలు బాగానే ఉన్నాయి. ధరలు కూడా అందుబాట్లో ఉన్నాయి.
ఇక్కడి ఆలయాల్లో మగవారిని పై దుస్తులతో వెళ్ళనీయరు. షర్ట్లు, బనియన్లు కూడా తొలగించాలి. కావాలంటే ఒక పైగుడ్డ వేసుకోవచ్చు. అందువల్ల ఒక తెల్ల పంచె, పై గుడ్డలతో మరుసటి రోజు దేవాలయానికి బయలుదేరాము. ఆశ్లేష బలి పూజ హోమము ఆ తర్వాత అభిషేక పూజలతో మధ్యాహ్నం అయింది. భక్తులతో ఉదయం చాలా రద్దీగా ఉంది. పూజల తర్వాత ఆ ఆలయ ప్రాంగణంలోనే ఉన్న నరసింహ స్వామిని, నాగ ప్రతిష్ట మండపాన్ని, ఇన్నితర చిన్న చిన్న ఆలయాలను చూసుకుని అక్కడి నుండి ఆది సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నాము.
దేవాలయ వీధి. ఈ వీధి కాక బస్టాండు వీధి. ఉరంతా కలిపితే ఉన్నవి ఈ రెండు వీధులే.
దర్శనాలు అయ్యాక మధ్యాహ్నానికి దేవాలయంలోనే భోజన వసతి ఉంది. భోజనం బాగుంది. భోజనం తర్వాత మధ్యాహ్నానికి విశ్రాంతి తీసుకున్నాము.
సాయంత్రానికి మళ్ళీ దైవ దర్శానానికి వెళ్ళాము. సాయంత్రం ఏ మాత్రం రద్ది లేదు. తీరుబడిగా దర్శనం ముగించి ఇక ఫోటోలు తీసే పనిలో పడ్డాను. చూడండి.
స్వామివారి తేరులు. అ వెనుక ఉన్నది భోజనశాల మరియు సత్రాలు.
గుడి నుండి దగ్గరలో ఉన్న సెలయేటి స్నాన ఘట్టం. ఇక్కడ మఠంలో నివసించేవారు, భక్తులు (పొర్లు దండాలు మొక్కున్నవరు) కూడా స్నానం చేయవచ్చు.
నది వెనుకున్న సెలయేరు.
మఠం
ఆదిసుబ్రహ్మణ్యస్వామి గుడి.
దారిలో ఉన్న ఒక ఇల్లు.
సంధ్య సమయం. ఇది 2013 సంవత్సరపు చివరి సాయంత్రం.
ఇక రాత్రి 10:30కు వోల్వో బస్సు వసతి ఉండటంతో దానికి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:30 బెంగళూరు చేరుకున్నాము.
We too went on this pilgrimage ,but in a car and enjoyed it.The scenery is wonderful.In Karnataka,good food is served free to all the pilgrims in every Mutham and temple.
ReplyDelete