మెరిన్ ల్యాండ్ అనబడే ఈ విహార స్థలి నయాగరా జలపాతానికి దగ్గరలోనే ఉన్నది. నయాగరా చూసిన తర్వాత తప్పకుండా చూసి ఆనందించాల్సిన ప్రదేశమిది. పిల్లలకు పెద్దలకు వినోదాన్ని పంచటానికి బోలెడన్ని రైడ్స్, డాల్ఫిన్ల ప్రదర్శన, వివిద రకాలైన తిమింగలాలను ఇక్కడ చూడవచ్చు. మరిన్ని వివరాలకి వికిపీడియా పుటను ఇక్కడ చూడండి.
అక్కడ తీసిన కొన్ని ఫోటోలు మీతో పంచుకుంటున్నాను.
ఇక్కడ తిమింగలాల ప్రదర్శన జరుగుతుంది. శిక్షకులు వచ్చి నిర్ణీత సమయాలలో ప్రదర్శన ఇప్పిస్తారు.
ఈ ప్రదర్శనలో తిమింగలం తన తోకతో నీటిని బాదుతూ చుట్టూ ఉన్న జనం నీళ్ళతో తడిచిపోయేలా చేస్తుంది. నీటీ నుంచి పైకెగిరి గిరికీలు కొట్టడం మరో అంశం. జనంపై నీళ్ళు పడేలా తోకతో నీటిని కొడుతున్న దృశ్యం పై ఫోటోలో చూడవచ్చు.
ప్రదర్శన తర్వాత తీరిగ్గా తిరుగుతూ(ఈదుతూ) సేద తీరుతున్న నేస్తం.
ఇక్కడి కొలనుల ప్రత్యేకత ఏమిటంటే ఇవి రెండు అంతస్తులుగా విభజించబడి ఉంటాయి. పైన మనకు సాధారణ కొలనులాగ కనిపిస్తుంది. అక్కడే ప్రదర్శనలు జరుగుతాయి. ఇక దిగువ అంతస్తు గాజుతో నిర్మించబడి లోపలినుండి జలచరాలను గమనించడానికి అనువుగా ఉంటాయి.
ఇది తెల్ల తిమింగలం (Beluga Whale). వీటితో ఏ ప్రదర్శనలు చేయించ లేదు. కానీ చూడటానికి విచిత్రంగా కనిపించాయి.
ఇది మెరిన్ ల్యాండ్ రైడ్లలో ముఖ్య ఆకర్షణ. దీన్ని స్కై స్క్రీమర్ అని పిలుస్తారు. ఇది ఎక్కి పైవరకు వెళితే నయాగరా జలపాతం మొత్తం కనిపిస్తుందట. మేము దీన్ని ఎక్కేంత సమయం లేకపోవటంతో ముందుకు సాగాము. ఇది ఎక్కాలంటే ముందు ఇది ఉన్న చిన్న కొండలాంటిదాన్ని ఎక్కాలి మరి. ఇదే కాకుండా ఇంకా చాలా రైడ్స ఉన్నాయి. చిన్న పిల్లలకు కూడా చాలా రైడ్స్ ఉన్నాయి.
కేవలం జలచరాలే కాకుండా ఎలుగుబంట్లు, జింకలు కూడా ఉన్నాయి. జింకలను మనం ముట్టుకుని, వాటిని నిమిరి, మేత పెట్టేందుకు కూడా వీలుంది.
ఇదే మెరిన్ ల్యాండ్కే ప్రధాన ఆకర్షణ. కింగ్ వడార్ఫ్ స్టేడియం. డాల్ఫిన్ల ప్రదర్శనా స్థలం. కేవలం డాల్ఫిన్లే కాకుండా సీల్స్, వాల్రస్లు కూడా ప్రదర్శనలో పాలు పంచుకుంటాయి.
ఇక ఈ షోకి సంబంధించిన వీడియోలు చూసే ముందు చిన్న మాట. కొన్ని వీడియోల నిడివి ఎక్కువగా ఉండటం వల్ల లోడు కావటంలో ఇబ్బందులు కలగవచ్చు. అందుకు ముందస్తు క్షమాపణలు.
ప్రేక్షకులలోనుండి ఒక పాప/బాబును పిలిచి ఆ పాప చేత డాల్ఫిన్ కు సూచనలు ఇప్పించి దాని చేత కొన్ని అంశాలను ప్రదర్శింపజేస్తారు. చివరగా ఒక డాల్ఫిన్ బూరను ఇచ్చి పంపుతారు.
తోకలూపుతూ బై బై చెపుతున్న డాల్ఫిన్లు.
వాల్రస్ ప్రదర్శన కూడా చూడండి మరి.
మధ్యాహ్నం వరకు అంతా తిరిగి చూసి సాయంత్రానికి మా ఊరికి తిరుగు ప్రయాణం కట్టాము.