గత మంగళవారం క్వీబెక్ జాతీయ దినం. మా ఊళ్ళో చాలా చోట్ల సోమవారం సాయంత్రమే సంబరాలు జరిగాయి. ఆటలు, పాటలతో పాటు బాణాసంచా ప్రదర్శన కూడా జరిగింది. మామూలుగా అయితే రోడ్డు మీద ఒకరూ కూడా కనబడరుగాని ఈ సంబరాలలో పాల్గొనటానికి వచ్చిన వందల మందిని చూస్తే మన ఊరి తిరునాల ఙ్ఞాపకం వచ్చింది. ఇక ఈ క్వేబెక్ దినమేమిటంటే దానికి పెద్ద కథే ఉంది. ఆసక్తి ఉన్నవారు ఇక్కడ చూడగలరు.
సంబరాలు జరిగింది మా ఇంటి దగ్గరే ఉన్న ఒక కాలేజి మైదానంలో కాబట్టి నిదానంగా భోజనం చేసుకుని బయలుదేరాము. అప్పటికే పాటల కచేరి జరుగుతోంది. ఇక్కడ ఇబ్బందేమిటంటే కూర్చోడానికి కుర్చీలు ఉండవు. అందరూ నిలబడో, కింద కూర్చొనో చూడాలి. లేకపోతే మడత కుర్చీలో తీసుకురావాలి. మేము కూడా ఇలాంటి సందర్భాల కోసమనే అలాంటి కుర్చీలు కొన్నాము. మన సాంస్కృతిక కార్యక్రమాలలాగ సుత్తి కొట్టేవాళ్ళనెవరినీ పిలవలేదు. నాయకులు వేదిక మీద నిషిద్ధం. ఒక ముసలాయన పాటలు పాడుతూ తన బృందంతో గాత్ర కచేరి నడుపుతున్నాడు. వయసు 75 సంవత్సరాలని తర్వాత తెలిసింది. ఆయన ఉత్సాహం చూస్తే అలా అనిపించదు. ఫ్రెంచి పాటలు కాబట్టి పూర్తిగా అర్థం కాలేదు కాని సంగీతం బాగుండటంతో సమయం తెలియలేదు. పక్కనే అంగళ్ళు, చిరుతిండ్ల దుకాణాలు, గోల చేసే పిల్లలు, అచ్చం మన జాతరను తలపించింది. ఇంతలో మా ఆఫీసువాళ్ళు (కెనడావారే) వచ్చి కలిశారు. వారితో లోకాభిరామాయణం ప్రారంభమైంది. ఇక ఇక్కడ బీరు ఇలాంటి సందర్భాలలో తెగ తాగుతారు. నేను తాగను (రాజు మంచి బాలుడు). గత సంవత్సరం జగ్గుల్లో, మగ్గుల్లో తాగేవారు. అలా ఒకడు తన మగ్గు బీరుతో నాకు స్నానం కూడా చేయించాడులెండి. ఈసారి మాత్రం చిన్నచిన్న టిన్లతో సరఫరా చేసారు. బ్రతికిపోయాను. దాదాపు 10.45 బాణాసంచా కాల్చటం ప్రారంభమైంది. నాకు మాత్రం చాలా అద్భుతం అనిపించింది. దాదాపు 11.30 బాణాసంచా కార్యక్రమం పూర్తయి మళ్ళీ పాటలు ప్రారంభించారు. మేము మాత్రం ఇంటికి వచ్చి ముసుగుతన్నాము. ఇక మీకోసం ఫోటోలు, వీడియోలు ఇక్కడ ఉంచుతున్నాను. ఎలా ఉన్నాయో చెప్పండి.
ఇదే స్వాగత ద్వారం.
పాటల కచేరి. ఫోటో బాగా షేకయ్యింది. సారీ.
వేల వేల వెలుగుపూలు.
ఉవ్వెత్తున వెలుగులు చిమ్ముతున్న కారంజి. (ఇది fountainకు కన్నడ పదం. తెలుగులో ఏమంటారో తెలిసినవారు చెప్పగలరు).