బెంగళూరుకు చుట్టు పక్కల దగ్గరలో ఏదైనా విహార ప్రాంతం ఉందా అని అంతర్జాలంలో వెతికితే అనేకల్ తాలూకాలోని ముత్యాల మడుగు జలపాతం గురించిన సమాచారం కనిపించింది. జలపాతం గురించి బాగా ఊరిస్తూ చెప్పారు. సరే, అలా ఆటవిడుపుగా ఉంటుందని అక్కడికే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఇక Google mapsలో muthyala maduvu, anekal అని వెతికేసి, ఎలా వెళ్ళాలో దారి తెలుసుకొని ఓ రోజు ఉదయాన్నే బయలుదేరాము. Electronic city నుండి 22 కి.మి దూరం ఉంటుందని తెలిసింది.
హొసూరు రోడ్డు మీదుగా బయలుదేరాము. వెళ్ళేదారి కొద్దిగా ఇబ్బంది పెట్టినా వేగంగా ప్రయాణించేందుకు వీలుగా ఉంది. తొందరగానే ఆనేకల్ ఊరిని చేరుకున్నాము. అక్కడ కొద్దిగా గందరగోళ పడ్డా దారి అడిగి తెలుసుకుని ముందుకు సాగాము. సిటీ వాతావరణానికి దూరంగా, పచ్చగా, అహ్లాదకరంగా ఉన్న కొండలు కనిపించసాగాయి. వాటి వైపు చిన్న చిన్న పల్లెలను దాటుకుంటూ సాగాము. బెంగళూరు నుండి దాదాపు అరగంట ప్రయాణం తర్వాత ముత్యాల మడుగు చేరుకున్నాము. అక్కడ ఉన్న హోటలు, అంగళ్ళు అన్నీ మూసి ఉన్నాయి. దగ్గరలో ఎక్కడా జలపాతం జాడ కనిపించ లేదు. కొద్దిసేపు అక్కడే వేచి చూసి, అటుగా వచ్చిన గొర్రెల కాపరిని వివరాలడిగితే, శని, ఆదివారాలు మాత్రమే అక్కడ జనసంచారముంటుందని, మామూలు రోజుల్లో ఎవరూ ఉండరని, జలపాతానికి దారి చూపించాడు. మేమున్న చోటినుండి కింద లోయలోకి దిగాలట. కిందకు దిగటానికి మెట్లు ఉన్నాయి.
మెట్లు దిగుతుండగానే, చిన్నగా నీళ్ళు పారుతున్న చప్పుడు వినిపించసాగింది. చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ కిందకు దిగసాగాము.
చివరకు జలపాతాన్ని చేరుకున్నాము. ఇది పెద్ద జలపాతమేమీ కాదు. కానీ, పైనుండి పడుతున్న నీటి తుంపరలు ముత్యాల్లా కనిపిస్తాయి. కాబట్టే దీనికి ముత్యాల మడుగు అని పేరొచ్చిందట.
జలపాతానికి దగ్గరలోనే ఈశ్వరుని గుడి ఉంది. కాని గుడి మూసి ఉంది. అదీకాక వర్షాల వల్ల బండలన్నీ జారుడుగా ఉన్నాయి. అందువల్ల నీళ్ళను దాటుకుని వెళ్ళటం కుదరదని మా ఆవిడ ఆర్డసింది. ఏం చేస్తాం ఇంతే ప్రాప్తమనుకుని ఈ ఫోటో మాత్రం తీసి ఇంటికి బయలుదేరాము.
వర్షాలు బాగా పడటం వల్ల జలపాతంలో వర్షపు నీరు ప్రవహిస్తోంది. బహుశా వేసవిలో ఓ ఆదివారం వెళ్ళి రావటానికి ఈ ప్రదేశం బాగుంటుందనుకుంటాను. మరోసారి వెళ్ళినప్పుడు చూడాలి.