ఈ ఆటల ఉద్దేశం ఏమైనా మన ప్రభుత్వం చేతకానితనాన్ని మాత్రం చాలా బాగా కళ్ళకు కట్టినట్లు చూడగలిగాము. సంవత్సరాల ముందే ఆటలు నిర్వహించాలని తెలిసినా, సరైన ప్రణాళిక లేకుండా చేసిన, చేస్తున్న పనుల నిర్వాకం వెగటు కలిగిస్తుంది. ఓ వైపు రాజకీయుల అవినీతి కంపు కొడుతుంటే మరోవైపు క్రీడాకారుల డోపింగ్ వ్యవహారం రోత కలిగిస్తోంది. రోజుకో క్రీడాంశంలో ఆటగాళ్ళు డోపింగ్ వల్ల నిషేధించబడుతున్నారు. ఆటలు ప్రారంభం కావటానికి కనీసం నెలైనా లేదు. ఇప్పటికీ మైదానాలు సిద్ధం కాలేదు. సిద్ధమైనవి నాసిరకపు నాణ్యతతో కట్టబడినవంటున్నారు. ఇంతటికీ కారణమైన వారిపై చర్యలు తీసుకోవటానికి సమయం సరిపోదని, అందువల్ల పెద్ద మనసు చేసుకుని ఎలాగోలా సర్దుకుపొమ్మని, ఆటలైపోయిన తర్వాత తగిన చర్యలుంటాయని మన ప్రభుత్వపు మాట. అంతా అయిపోయిన తర్వాత చేసేదేమిటో నాకర్థం కాలేదు. ప్రజా ధనాన్ని అడ్డంగా దోచుకున్న వారిని వెంటనే బంధించి, తగిన శిక్ష వేయకుండా, వారి చేతుల్లోనే మనదేశ గౌరవముందని, ఎలాగూ ఇప్పటివరకు ఇంత మోసపోయారు, ఇంకొంతకాలం వీరిని భరించి మరికొంత మోసపొమ్మని దేశ ప్రజలకు చెప్పగల అధినేతలు ఉండటం మన దురదృష్టం. ఇంత జరిగాక కాపాడుకోవాటానికి ఇంకా ప్రపంచం దృష్టిలో గౌరవం మిగిలి ఉందనుకోను. మణిశంకర్ అయ్యర్ చెప్పినట్లు ఆటలు విఫలమై ప్రపంచం ముందు తల దించుకోవలసిన సమయం వస్తుందేమోనని భయం వేస్తుంది. అవినీతికి కూడా ఓ హద్దు ఉండాలి. లేకపోతే సమాజం చెదలు పట్టిన మహా వృక్షంలా కుప్పకూలుతుంది. అంతా చేసుకున్న ఖర్మ.
Saturday, September 11, 2010
Subscribe to:
Posts (Atom)