బెంగళూరు నగరంలో నిన్న జరిగిన పేలుళ్ళు ఇద్దరిని బలి తీసుకున్నాయి. ఈ ఘాతుకానికి కారణమెవరో తెలియకపోయినా అనుమానాలు మాత్రం సిమి పైన ఉన్నాయి. బాంబులు తక్కువ శక్తివంతమైనవైనా వాటిని ఉపయోగించటంలో ఆధునిక technology వాడబడిందని వార్త. ప్రజలను భయభ్రాంతులను చేయటానికే వీటిని పేల్చారని అనుకుంటున్నారు. బహుశా బవిష్యత్తులో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడటానికే ఈ సన్నాహం అయుండవచ్చు. దాడులకు ప్రభుత్వ ప్రతిస్పందన గమనించి తమ భవిష్య పథకాలను పకడ్బందీగా రచించాలన్నది ఉగ్రవాదుల వ్యూహమైయుండవచ్చు. మరి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్య, ఐటి సంస్థలకు అధిక భద్రత కల్పిస్తామన్న ప్రకటన. ఐటి సంస్థలు సరే మరి సామాన్య పౌరుల విషయమేమిటి? ఇలాంటి దాడుల్లో ఎక్కువగా బలైయ్యేది వీరే కదా? ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే సంస్థలను నిషేధించినంత మాత్రానా సరిపోతుందా? దేశంలో జరిగిన అనేక ఉగ్రవాద దాడులకు కారణమైనవారు బెంగళూరులో తలదాచుకోవటం చాలా సంవత్సరాలుగా జరుగుతున్నది. ఇలాంటివారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ప్రభుత్వానికే తెలియాలి. నిషేధిత సంస్థల కార్యకలాపాలపైనా ఆర్థిక వనరులపైనా గట్టి నిఘా ఉంటే ఇలాంటి దాడులని అరికట్టే అవకాశం ఉంటుంది.
ఈ దాడుల్లో ఎక్కువగా ప్రాణనష్టం జరగకపోవటం ఊరటనిచ్చేదే అయినా ఈ ఊరట ఎన్నాళ్ళో? తన దౌర్బల్యానికి అమాయక ప్రజల ప్రాణాలు మూల్యంగా చెల్లించుకుంటున్నామన్న స్పృహ ప్రభుత్వానికి కలగాలని ఆశిస్తున్నాను.